దుబాయ్: తనతో పాటు సీనియర్ ఆటగాళ్లు టీ20ల్లో ఆడకపోవడమనేది జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌చేయడానికే తనతో పాటు సీనియర్ ఆటగాళ్లు టీ20లకు దూరంగా ఉంటున్నారని స్పష్టం చేశాడు.
గత 8 నెలలుగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ ఆడటం లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని కుర్రాళ్ల టీమ్ టీ20 సిరీస్‌లు ఆడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో పెట్టుకొని యువకులతో కూడిన జట్టును బీసీసీఐ సిద్దం చేస్తోందని, అందుకే సీనియర్లను పక్కనపెట్టినట్లు వార్తలు వచ్చాయి.

వన్డే ప్రపంచకప్ అనంతరం సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తాజాగా వన్డే ప్రపంచకప్ టైటిల్‌తో ఫోజిచ్చిన రోహిత్.. ఐసీసీతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'మా ముందున్న అతి ముఖ్యమైన టోర్నీ వన్డే ప్రపంచకప్. ఈ సందర్భంగా అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ప్రతీ ఒక్కరూ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను ఆడటం కుదురదు. క్రికెట్ షెడ్యూల్‌ను చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతోంది. తీరికలేని మ్యాచ్‌ల కారణంగా ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. వర్క్‌లోడ్‌ను మేనేజ్‌చేయడానికి విశ్రాంతి చాలా అవసరం. నేను కూడా ఇదే జాబితాలోకి వస్తా. ఇటీవల మ్యాచ్‌ల సంఖ్య పెరగడంతో ఆటగాళ్లపై పని ఒత్తిడి ఎక్కువైంది. అందుకే నాతో పాటు సీనియర్ ఆటగాళ్లందరిని టీ20లకు దూరం పెట్టారు. ఇది జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే.'అని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ టైటిల్ అద్భుతంగా ఉందని చెప్పిన రోహిత్ శర్మ.. ఈ ట్రోఫీని ముద్దాడుతామని ధీమా వ్యక్తం చేశాడు. 'వన్డే ప్రపంచకప్‌ను దగ్గరగా చూడటం ఇదే తొలిసారి. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినా ఆ జట్టులో నేను లేను. కానీ ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఈ ట్రోఫీ(వన్డే ప్రపంచకప్ 2023) చూడమచ్చటగా ఉంది. ఈ సారి ఈ టైటిల్‌ను ముద్దాడుతామనే నమ్మకం ఉంది.
సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరగనుండటంతో మాకు అభిమానుల నుంచి మద్దతు లభించనుంది. ప్రతీ వేదికలో అభిమానులు మాకు అండగా నిలవనున్నారు. 12 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరుగనున్న ఈ మహాసంగ్రామం కోసం ప్రతీ భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. 2016లో టీ20 ప్రపంచకప్ ఆడినా.. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ జరగనుంది.
దాంతో ప్రతీ ఒక్కరు ఈ టోర్నీ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వరల్డ్ కప్ బజ్‌మొదలైంది. అన్నీ వేదికల్లో ఆడేందుకు మేం సిద్దంగా ఉన్నాం. 2011 ప్రపంచకప్ మధురానుభూతిని మిగిల్చింది. ఈ టోర్నీని నేను ఇంట్లో నుంచి చూశాను. ఆ టోర్నీలోని ప్రతీ మ్యాచ్, ప్రతీ బాల్ నేను చూశాను.
దురదృష్టవశాత్తు ఆ జట్టులో నాకు చోటు దక్కకపోవడం బాధకు గురి చేసింది. కానీ ఇంట్లో నుంచి భారత్ విజయాలను ఆస్వాదించాను. క్వార్టర్, సెమీఫైనల్, ఫైనల్లో భారత్ అద్భుతంగా ఆడింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.