
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ చేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమకు ఏది కలిసిరాలేదని, ఇక మేం చేసేది కూడా ఏం లేదన్నాడు. అందుకే భవిష్యత్తుపై దృష్టిసారిస్తున్నామని చెప్పాడు. ఆ క్రమంలోనే తుది జట్టులో కొత్త ఆటగాళ్లకు అవకాశాలిస్తూ ప్రయోగాలు చేయాలని భావించామని చెప్పాడు.
'చేజింగ్ టీమ్‌కు అనుకూలించడం ఈ మైదానం యొక్క సహజశైలి. మా జట్టుకు కూడా ఇది సరిగ్గా నప్పుతోంది. అందుకే ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నా. ఈ సీజన్‌లో తమకు ఏది కలిసి రాలేదు. అందుకే ఫ్యూచర్‌పై ఫోకస్ పెట్టాం. ఆ క్రమంలోనే కీరన్ పొలార్డ్‌ను పక్కనపెట్టి స్టబ్స్‌కు అవకాశం ఇచ్చాం. మురుగన్ అశ్విన్ స్థానంలో షోకీన్ వచ్చాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా అతను రాణిస్తున్నాడు. మేం కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. వారి సత్తా ఏంటో పరీక్షించాలనుకుంటున్నాం. ఈ వికెట్ చాలా బాగా కనబడుతోంది. 40 ఓవర్ల వరకు అది అలానే ఉంటుందని ఆశిస్తున్నా. చెన్నైపై ఆడటం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పోరులను తాము ఎప్పుడూ ఇష్టపడతాం. విజయం కోసం మేం సాయశక్తులా ప్రయత్నిస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చే అంశమని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. తాము ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. అయితే జడేజా లేని లోటును భర్తీ చేయడం కష్టంగా మారిందన్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో అదరగొట్టే జడ్డూ లాంటి ప్లేయర్ మరొకరు దొరకడం కష్టమని చెప్పాడు. ప్రత్యర్థితో పని లేకుండా మన ప్రక్రియపై ఫోకస్ పెడితే సక్సెస్ సాధించవచ్చని ధోనీ తెలిపాడు.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్, ముఖేశ్ చౌదరి
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ట్రిస్టాన్ స్టబ్స్, రమన్‌దీప్ సింగ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్