భావ్యం కాదనే...
'మహమ్మద్ షమీ మన్కడింగ్ రనౌట్ చేస్తాడని తెలియదు. ఆ సమయంలో డసన్ షనక 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాంటి ప్లేయర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం భావ్యం కాదనే అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాం. షనక అసాధారణ పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు'అని రోహిత్ శర్మ ప్రశంసించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రైకింగ్ తీసుకోవాలనే ఆతృతలో షమీ బంతి వేయక ముందే షనక క్రీజు ధాటాడు. ఇది గమనించిన షమీ.. మన్కడింగ్ పద్దతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకోని షమీ చేత అప్పీల్‌ను వెనక్కి తీసుకునేలా చేశాడు. అప్పీల్ వెనక్కి తీసుకోకపోయుంటే.. నిబంధనల ప్రకారం షనక ఔటయ్యేవాడు.
బౌలింగ్ మెరుగుపడాలి..
ఈ మ్యాచ్‌లో తమ బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించిందని చెప్పిన రోహిత్.. కఠిన పరిస్థితుల్లో బౌలర్లు రాణించలేకపోయారని తెలిపాడు. జట్టు ఫీల్డింగ్ కూడా మెరుగుపడాలని, జట్టులోని ప్రతీ ఒక్కరు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. 'ఈ మ్యాచ్‌లో మా ప్రదర్శన ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో మేం అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. బ్యాటర్లంతా గొప్ప ప్రదర్శన కనబర్చారు. అయితే బౌలర్లే ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది. కండిషన్స్ కూడా అంత సులువుగా లేవు.
కఠినమైన కండిషన్సే...
లైట్స్ కింద, మంచు ప్రభావంతో బౌలింగ్ చేయడం ఆశమాషి వ్యవహరం కాదు. విజయం సాధించాలంటే జట్టులోని ప్రతీ ఒక్కరు సత్తా చాటాల్సిందే. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. చివరి ఓవర్లలో విఫలమయ్యాం. అయితే క్యాచ్‌లు నేలపాలవ్వడం కూడా బౌలర్ల వైఫల్యానికి కారణమైంది. మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కఠినమైన క్యాచ్‌లను కూడా పట్టాల్సిందే. జట్టుగా కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. జట్టులోని 11 మంది సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
వణికించిన షనక..
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 113) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. షనక(88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్భుత సెంచరీతో టీమిండియాను వణికించాడు.


Click it and Unblock the Notifications












