టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ఈ వికెట్‌పై మేం ఒక మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్‌లో మేం మంచి స్కోర్ చేశాం. వికెట్ బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక్కడ జట్టులోని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడం కీలకం. ఇది చాలా పెద్ద మ్యాచ్. అయితే ప్రశాంతంగా ఉండటం ముఖ్యం.

మంచి జట్టుతో ఆడుతున్న మరో అంతర్జాతీయ మ్యాచ్ అనుకొవాలి. ఈ టోర్నీలో సౌతాఫ్రికా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. మేం కూడా అదే రితీలో ఆడి ఫైనల్ చేరాం. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
ఇప్పటి వరకు మా జట్టులో మ్యాచ్‌కో విన్నర్ బయటకు వచ్చాడు. ఫైనల్లో కూడా అదే తరహా ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నామని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ పొడిగా ఉంది. కానీ మాకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. బంతితో సత్తా చాటుతాం. ఈ టోర్నీలోని కొన్ని మ్యాచ్‌ల్లో మేం అత్యుత్తమ ప్రదర్శన చేయకపోయినా.. ఆఖరి వరకు పోరాడి విజయాన్నందుకున్నాం.
ఆ విజయాలు మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. పర్‌ఫెక్ట్ అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ మేం దానికి దగ్గరగా రాణించే ప్రయత్నం చేస్తాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మాకు ఇప్పటి వరకు ఫైనల్ ఆడిన అనుభవం లేదు. ఈ మ్యాచ్‌ను మేం పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాం. అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, టబ్రైజ్ షంసీ.