
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానం బౌండరీలు చిన్నగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బట్లర్ తెలిపాడు. కండిషన్స్ అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నాడు. తప్పని పరిస్థితుల్లో రెండు మార్పులు చేయాల్సి వచ్చిందని, డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ గాయాలతో దూరమయ్యారని చెప్పాడు. ఈ ఇద్దరి స్థానాలను సాల్ట్, జోర్డాన్ భర్తీ చేస్తున్నారని పేర్కొన్నాడు. పిచ్ బాగుందని, మ్యాచ్ అద్భుతంగా సాగుతుందని ఆశిస్తున్నానని తెలిపాడు.
ఇక టాస్ గెలిచినా తాను బ్యాటింగ్ ఎంచుకునేవాడినని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ టోర్నీలో తమ జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడిందని, ఇది తమకు మరో బంగారం లాంటి అవకాశమని చెప్పాడు. ఒత్తిడికి గురికాకుండా ఉండటం చాలా ముఖ్యమని, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల గురించి తమకు బాగా తెలుసని, ఇటీవల వారితో చాలా మ్యాచ్‌లు ఆడామని చెప్పాడు. వారి బలాలు, బలహీనతలు తమకు తెలుసున్నాడు. ప్రశాంతంగా ఉంటూ ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయడం చాలా ముఖ్యమన్నాడు. తనకు గాయమైనప్పటికీ.. ప్రస్తుతం బాగానే ఉన్నానని స్పష్టం చేశాడు. ప్రతిభావంతమైన ఆటగాళ్లు జట్టులో ఉండటంతో ఫైనల్ ఎలెవన్ ఎంపిక కష్టంగా ఉందని, తాము మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
షార్ట్ బౌండరీలు ఉన్న నేపథ్యంలోనే బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకొచ్చామని రోహిత్ స్పష్టం చేశాడు. యుజ్వేంద్ర చాహల్ జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగినా.. పిచ్ ఫ్లాట్‌గా ఉండటం, స్పిన్నర్లకు సహకరించే అవకాశం లేకపోవడంతో అతన్ని తీసుకోలేదు.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్.