టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచింది. 11 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో ఐసీసీ టైటిల్ అందుకుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. అయితే ఈ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లను హోటల్ నుంచి బయటకు రానివ్వలేదని రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా జియోహాట్ స్టార్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రోహిత్.. మెగా టోర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు హోటల్ గది నుంచి బయటకు రావద్దని మాకు చెప్పారు. భారత జట్టుకు ముప్పు ఉందనే హెచ్చరికలు జారీ చేశారు. మా చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు. మా ఫుడ్‌ను మేం ఆర్డర్ చేసుకొని హోటల్ రూమ్స్‌లోనే తిన్నాం. అభిమానులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులతో హోటల్ కిక్కిరిసిపోయింది. వారిని చూసి ఇది సాధారణ మ్యాచ్ కాదనే విషయం గ్రహించాం. ఏదో జరగబోతుందని అనిపించింది. మ్యాచ్ రోజు మేం స్టేడియానికి చేరుకోగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్, పాకిస్థాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అప్పటికే నేను పాకిస్థాన్‌తో చాలా మ్యాచ్‌లు ఆడాను. కానీ ఈ మ్యాచ్‌కు ముందు కనిపించిన ఉత్సాహం, అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీ రౌఫ్(3/21), నసీమ్ షా(3/21) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్(2/23) రెండు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ షా అఫ్రిది(1/29) ఓ వికెట్ తీసాడు.
అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్ నిలకడైన బ్యాటింగ్‌తో 73/2తో పటిష్టంగా కనిపించిన పాక్.. వరుసగా వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.