టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన లవ్ స్టోరీకి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. తన సతీమణి రితికా సజ్దేకు సినిమాటిక్ తరహాలో సెటప్ చేసి మరి ప్రపోజ్ చేశానని వెల్లడించాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సతీసమేతంగా పాల్గొన్న రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన దగ్గర మేనేజర్‌గా పనిచేసిన రితికాకు ప్రపోజ్ చేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నాడు.
'నా ప్రపోజల్ చాలా రొమాంటిక్‌గా జరిగింది. నా 12 ఏళ్ల వయసులో నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన ప్రదేశానికి రితికాను తీసుకెళ్లాను. వాస్తవానికి ఆరోజు మేం మా ఇంట్లోనే ఉన్నాం. ఆమె ఇంటి నుంచి భోజనం కూడా తెచ్చుకుంది. నాకు బోర్ కొడుతుందని, ఐస్‌క్రీమ్ తినడానికి బయటకు వెళ్దామని అడిగాను. నా కారులో ఇద్దరం బయల్దేరాం. మేం మెరైన్ డ్రైవ్, హాజీ అలీ, వర్లీ, దాదర్, బాంద్రా దాటి వెళ్లాం. దాంతో రితికా ఐస్ క్రీమ్ ఎక్కడా? అని అడిగింది. అప్పుడు నేను రితికాకు బోరివాలిలో మంచి ఐస్ క్రీమ్ షాప్ ఉందని చెప్పాను. నా చిన్నప్పుడు నేను ఆ ప్రాంతంలో నివసించేవాడిని. తరువాత మేం స్టేడియానికి చేరుకున్నాము. అప్పటికే నా స్నేహితులకు చెప్పి సెటప్ వేయించాను. నా ప్రపోజల్ సన్నివేశాన్ని కెమెరాల్లో బంధించాలని కోరాను. అక్కడ చీకటిగా ఉండటంతో అది గ్రౌండ్ అని రితికాకు తెలియలేదు. పిచ్ దగ్గర కారు ఆపాను. కారు దిగి పిచ్ మధ్యలో మోకాళ్లపై కూర్చొని రితికాకు ప్రపోజ్ చేశాను.'అని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.

రితికాను 2008లో తొలిసారి కలిసానని రోహిత్ శర్మ చెప్పాడు. తమ మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి ఒక్కటయ్యేలా చేసిందన్నాడు. 2015లో వివాహబంధంతో ఒక్కటైన రోహిత్, రితికా సజ్దేకు 2018లో సమైరా పుట్టింది. గతేడాది నవంబర్ 15న అహాన్ జన్మించాడు. రితికా సజ్దే రోహిత్ శర్మ కంటే ముందు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలకు మేనేజర్‌గా పనిచేసింది. రితికా తన సోదరి అంటూ యువరాజ్ సింగ్ తనను చాలా సార్లు హెచ్చరించాడని రోహిత్ శర్మ చాలా ఇంటర్వ్యూలో తెలిపాడు.
రోహిత్ శర్మ ఆడే ప్రతీ మ్యాచ్‌కు రితికా సజ్దే హాజరయ్యేది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు రితికా క్రాస్డ్ ఫింగర్స్‌తో ఉండటం ఆమెకు సెంటిమెంట్. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌లు ఆడినప్పుడు నొప్పి వేసినా.. క్రాస్ ఫింగర్స్ మార్చేదాన్ని కాదని రితికా చాలా ఇంటర్వ్యూలో తెలిపింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన రోహిత్.. రితికా నా అదృష్ట దేవత అని చెప్పుకొచ్చాడు.
'క్రాస్ ఫింగర్స్ గురించి నేను రితికను చాలాసార్లు అడిగాను. ఎందుకంటే మ్యాచ్ అంతా క్రాస్ ఫింగర్స్‌తో కూర్చోవడం చాలా కష్టం. ఆమె నా ఆటలో చాలా నిమగ్నమైంది. నేను బాగా ఆడాలని కోరుకుంటుంది. ఆమె నా అదృష్ట దేవత.నా అతిపెద్ద సపోర్టర్'అని రోహిత్ తెలిపాడు.
జీవితంలో తనకు ఎలాంటి పశ్చాతాపం లేదని, దేవుడు తనకు ఎన్నో ఇచ్చాడని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 'జీవితంలో ఏదైనా పశ్చాత్తాపం ఉందా? అనే ప్రశ్న చాలా ఇంటర్వ్యూల్లో ఎదురైంది. నేను పశ్చాత్తాపం ఎందుకు? అని అడిగాను. 25 ఏళ్ల క్రితం నేను ఎక్కడ.. ఎలా ఉన్నానో తెలుసు. ఇప్పుడు నా జీవితం ఏంటో తెలుసు. దేవుడు ఇచ్చిన దానికి నేను సంతోషంగా ఉన్నాను. ఈ ప్రశంసలు.. ఈ సదుపాయాలు అంది నేను ఇక్కడ కూర్చుంటానని నేను అస్సలు అనుకోలేదు. మీకు ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేవుడు నాకు ఇది రాసిపెట్టాడు. కాబట్టి నాకు ఇవన్నీ దక్కాయి. వీటితో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు.'అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.