
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు చుక్కలు చూపించారు. ఈ అనూహ్య ఘటనతో రోహిత్ శర్మ నిర్ఘాంతపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియాకప్ 2022 టోర్నీ కోసం రోహిత్ సమయాత్తం అవుతున్నాడు. ఆ కారణంగానే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం హోమ్ టౌన్ ముంబైలో ఫ్యామిలీతో గడుపుతున్నాడు.
ఇక మంగళవారం ముంబైలోని హోటల్‌కు వెళ్లిన రోహిత్‌కు అభిమానులు ఊహించని షాకిచ్చారు. రోహిత్ ఆ హోటల్‌కు వచ్చాడని తెలుసుకున్న కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయడంతో చుట్టు పక్కన ఉన్నవాళ్లంతా రోహిత్ శర్మను చూసేందుకు హోటల్‌కు వచ్చారు. సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చినంత మంది హోటల్‌కు రావడంతో బయటకు వచ్చిన రోహిత్ షాకయ్యాడు. హోటల్ సిబ్బంది సైతం అవాక్కయ్యారు.
బయటకు వెళ్లేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించినా.. అప్పటికే హోటల్ ముందు అభిమానులు బారులు తీరారు. దీంతో రోహిత్.. ''వామ్మో ఏంది ఇంత జనం'' అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది వచ్చి అభిమానులు క్లియర్ చేసాక హోటల్ నుంచి వెళ్లిపోవచ్చు అని రోహిత్‌కు సలహా ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. పోలీసుల సహాయం కోరిన హోటల్ సిబ్బంది.. రోహిత్ శర్మ క్షేమంగా ఇంటికి పంపించారు. ఈ ఊహించని అభిమాననికి రోహిత్ కళ్లు చెమ్మగిల్లాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరో రెండు రోజుల్లోనే రోహిత్ సేన దుబాయ్‌కు వెళ్లనుంది. ఇక కేఎల్ రాహుల్ సారథ్యంలోని మరో భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. అక్కడ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను గురువారం హరారే వేదికగా ఆడనుంది. ఇప్పటికే అక్కడికి చేరిన రాహుల్ సేన.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.