
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు. 13 ఏళ్ల ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా నిలిచాడు. గురువారం ఢిల్లీక్యాపిటల్స్ తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో రోహిత్ బలహీనతను వ్యూహంగా మార్చుకున్న ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రవిచంద్రన్ అశ్విన్‌ను బరిలో దింపాడు.
అతని బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఈ ముంబై కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో రోహిత్ ఇలా డకౌట్ కావడం 13వ సారి. ఇప్పటి వరకూ పార్థీవ్ పటేల్, హర్భజన్ సింగ్ మాత్రమే 13సార్ల చొప్పున ఐపీఎల్‌లో డకౌటయ్యారు. తాజా గోల్డెన్ డకౌట్‌తో హిట్ మ్యాన్ వారి సరసన నిలిచాడు.
2018 వరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా గోల్డెన్ డకౌట్ కాని రోహిత్.. 2018 నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా రోహిత్‌కు ఈ చెత్త రికార్డు ఉంది. భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడు కూడా రోహితే. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగోస్థానంలో ఉన్న రోహిత్.. నాకౌట్స్ లేదా ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. నాకౌట్ లేదా ప్లేఆఫ్‌ల్లో ఇప్పటి వరకూ 19 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. కేవలం 12.72 సగటు, 101.32 యావరేజ్‌తో 229 రన్స్ చేశాడు. అందులో 3 డకౌట్లు ఉన్నాయి.
గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు హిట్ మ్యాన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల చర్చ జరుగుతున్న తరుణంలో.. అతడు పేలవ రీతిలో అవుటవుతుండటం అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. అయితే పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకుండానే హిట్ మ్యాన్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతని ఫీల్డింగ్ ప్రమాణాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. ఇతర ఆటగాళ్లు చెలరేగడంతో ముంబై ఇండియన్స్ 57 పరుగులతో ఢిల్లీని చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.
వీరి ప్రతాపానికి అశ్విన్ (3/29) ప్రదర్శన చిన్నబోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బుమ్రా (4/14) పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.