టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. తిలక్ వర్మ మాటలు అమయాకంగా ఉన్నా.. అతను మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ అసాధారణమని ప్రశంసించాడు. టీమిండియా టీ20 టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన తిలక్ వర్మ.. వృషణాల సర్జరీతో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న అతను మెగా టోర్నీ సమయానికి జట్టులోకి రానున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 'వరల్డ్ కప్ రోడ్ మ్యాప్' షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మ మైండ్‌సెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'తిలక్ వర్మ తొలిసారి మా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చినప్పుడే అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని నాకు అనిపించింది. నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే. అతని సంభాషణ. అతని మాటలు చాలా అమాయకంగా అనిపించినా అందులో ఎంతో అర్థం ఉండేది. నాతో మాట్లాడిన ప్రతీసారి అప్‌ది ఆర్డర్ పంపించాలని, మ్యాచ్ ఫినిష్ చేస్తానని బతిలాడేవాడు. నేను ముంబై కెప్టెన్‌గా ఉన్న 2022, 2023 సీజన్‌లో తిలక్ ప్రతీసారి తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడేవాడు. అతని మనస్తత్వం, దృక్పథం అద్భుతం. అతనికి క్రికెట్ అంటే పిచ్చి.
అన్నిటికంటే అతని టెంపర్‌మెంట్ అద్భుతం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ నమ్మశక్యం కానిది. ఓవైపు వికెట్లు పడుతున్నా... కిక్కిరిసిన జనాలతో స్టేడియం మొత్తం గోల గోలగా ఉన్నా.. అది ఒక ఫైనల్ అని తెలిసినా.. తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. ఇది ఇంకా అతనికి ప్రారంభ దశే. కానీ తను ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పటికే పలుమార్లు ఆదుకున్నాడు.'అని రోహిత్ కొనియాడాడు.
ఛేజింగ్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన తిలక్ వర్మ.. టీ20 కెరీర్‌లో 39.93 సగటుతో పరుగులు చేస్తే.. ఛేజింగ్‌లోనే 68 సగటుతో రాణించాడు. ఇంగ్లండ్‌తో ఓ మ్యాచ్‌లో 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును 72 పరుగులు చేసి గెలిపించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సర్జరీ నుంచి కోలుకుంటున్న తిలక్ వర్మ.. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించాడు. ప్రపంచకప్ సమయానికి అతను జట్టులోకి రానున్నాడు.