పల్లెకెలె: పాకిస్థాన్ జట్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తుందని కొనియాడాడు. టీ20లతో పాటు వన్డేల్లోనూ పాక్ అదరగొడుతుందని కితాబిచ్చాడు. నెంబర్ వన్ జట్టు అయ్యేందుకు బాబర్ సేన చాలా కష్టపడిందని చెప్పిన రోహిత్.. ఆ జట్టు నుంచి తమకు గట్టి సవాలే ఎదురుకానుందని తెలిపాడు.
ఆసియాకప్ 2023లో భాగంగా శనివారం శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించి అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాడు. టీమ్ కాంబినేషన్‌తో పాటు పాకిస్థాన్ బౌలర్లను ఎలా ఎదుర్కోబోతున్నామనే విషయాలను కూడా తెలియజేశాడు.

'పాకిస్థాన్ అసాధారణమైన జట్టు. ఇటీవల వన్డేలు, టీ20ల్లో నిలకడగా రాణిస్తోంది. నెంబర్ వన్ అయ్యేందుకు చాలా కష్టపడింది. రేపు మాకు మంచి సవాల్ ఎదురు కానుంది.'అని రోహిత్ శర్మ తెలిపాడు. ఆసియాకప్‌లో భారత్-పాక్ ఫైనల్ చేరకపోవడంపై ఎదురైన ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ ఆడుతాయని ఆశిస్తున్నానని తెలిపాడు.
టాపార్డర్ బ్యాటర్‌గా జట్టుకు శుభారంభం అందించడంతో పాటు ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. 'జట్టుతరఫున మెరుగ్గా ఆడటం.. మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. నేనెప్పుడూ జట్టు విజయం కోసం ఆడుతాను. గత కొన్నేళ్లుగా నేను హై రిస్క్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేశాను. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం కూడా నాకు తెలుసు. ఏది ఏమైనా నా జట్టును మంచి స్థితిలో నిలపడమే నా పని.
నేను మంచి రిథమ్‌లో ఉంటే.. నా వికెట్‌ను అస్సలు పారేసుకోను. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. టీ20ల్లో ఇది అవసరం లేకపోయినా.. వన్డేల్లో మాత్రం తప్పనిసరి.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ బౌలర్లను ఎలా ఎదుర్కోబోతున్నారని అడిగిన ప్రశ్నకు.. అనుభవంతోనే బదులిస్తామని రోహిత్ సమాధానమిచ్చాడు.
'మా జట్టులో షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ లేరు. నెట్స్‌లో వారి బౌలింగ్ కూడా ఎదుర్కొలేదు. మాకు అందుబాటులో ఉన్నవారితోనే మేం ప్రిపేరయ్యాం. వాళ్లు కూడా నాణ్యమైన బౌలర్లే. మా అనుభవాన్ని ఉపయోగించి పాక్ బౌలర్లను ఎదుర్కొంటాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు
టీమ్ కాంబినేషన్‌పై స్పందిస్తూ.. 'మాకు చాలా కాంబినేషన్స్ అందుబాటులో ఉన్నాయి. గురువారం జరిగిన మ్యాచ్ ఆధారంగా టీమ్ కాంబినేషన్‌ను నిర్ణయిస్తాం. మా బ్యాటింగ్ లైనప్‌లో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.
ఆసియాకప్ చాలా పెద్ద టోర్నీ. ఎంతో చరిత్ర ఉంది. ఈ టోర్నీ మాకు ఫిట్‌నెస్ టెస్ట్‌లా కాదు. గతవారం జరిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లోనే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించాం. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. అతని రాక మా జట్టుకు శుభ సూచకం.'అని చెప్పుకొచ్చాడు.