రోహిత్ శర్మ మరసారి తన కెప్టెన్సీ పవర్ ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన సారథ్యంతో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ.. గత మూడేళ్లుగా టీమిండియాను అదే రీతిలో నడిపిస్తున్నాడు. 12 నెలల వ్యవధిలోనే మూడు ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు.
విరాట్ కోహ్లీ అనంతరం టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ తన మార్క్ కెప్టెన్సీతో అద్భుత విజయాలు అందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ 2023 టైటిళ్లను తృటిలో చేజార్చుకున్న రోహిత్ శర్మ.. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాను ఫైనల్ చేర్చాడు.

నలుగురు స్పిన్నర్లతో..
టీమ్ ఎంపిక నుంచి మైదానాల్లో వ్యూహాల వరకు రోహిత్ శర్మ చాలా భిన్నంగా ఆలోచిస్తాడు. ప్రతీ నిర్ణయంలోనూ తన మార్క్ చూపిస్తాడు. ఈ టీ20 ప్రపంచకప్‌కు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పేస్‌కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్‌లో నలుగురు స్పిన్నర్లు ఎందుకు? అని క్రికెట్ విశ్లేషకులు అప్పట్లో పెదవి విరిచారు.
మురీ ముఖ్యంగా అక్షర్ పటేల్ ఎంపికను తప్పుబట్టారు. అప్పుడు మౌనంగా ఉన్న రోహిత్ శర్మ.. టోర్నీ మొదలయ్యాక ఈ నిర్ణయం విలువ తెలుస్తుందని చెప్పాడు. రోహిత్ చెప్పినట్లుగానే అక్షర్ పటేల్ 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో సత్తా చాటాడు.
అటాకింగ్ గేమ్‌తో..
కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రోహిత్ సత్తా చాటుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడిని పెంచుతూ పరుగులు రాబడుతున్నాడు. తనతో పాటు టీమ్ మొత్తాన్ని దూకుడుగా ఆడేలా చేశాడు. రోహిత్ శర్మ ధాటికి ఈ టోర్నీలో బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బౌలర్లు తేలిపోయారు. జట్టు ఏ ఒక్కడిపైనో ఆధారపడకుండా సమష్టి ప్రదర్శన చేసేలా మార్చాడు.
ఈ టోర్నీలో మ్యాచ్‌కు ఒక్కరు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా నిలిచారు. రోహిత్ శర్మ.. బౌలర్లను ఉపయోగించుకునే తీరు.. ప్రత్యర్థి బ్యాటర్లకు తగ్గట్లు ఫీల్డ్ సెట్ చేసే విధానం అద్భుతం. ప్రతీ ఒక్క ఆటగాడికి అండగా ఉంటూ వారితో వ్యూహాలు రచిస్తున్నాడు. పిచ్ కండిషన్స్ తగ్గట్లు వ్యూహాలు రచిస్తూ ఫలితాలను రాబడుతున్నాడు. ఇదే జోరును సౌతాఫ్రికాతో శనివారం జరిగే ఫైనల్లో చూపించి టైటిల్ గెలవాలని రోహిత్ భావిస్తున్నాడు. అదే జరగాలని మనం కోరుకుందాం.