
బెంగళూరు: టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపెట్టేందుకు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు. తొడ కండరాల గాయంతో సౌతాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమైన రోహిత్ శర్మ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదురవుతుండటంతో శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టిన హిట్‌మ్యాన్ వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణుల సూచనల మేరకు బరువు తగ్గడంపై దృష్టిసారించాడు. ఈ క్రమంలోనే గత రెండు నెలల్లో అతను ఏకంగా 6 కిలోల బరువు తగ్గినట్లు ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి.
ఆ మధ్య రోహిత్ శర్మ తన న్యూలుక్‌ను అభిమానులతో పంచుకున్నప్పుడే అతను సన్నబడిన విషయం అందరికి తెలిసింది. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిసారించిన హిట్ మ్యాన్.. జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాడు. బొద్దుగా ఉండే రోహిత్.. విరాట్ కోహ్లీలా సన్నబడ్డాడు. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతలతో పాటు టెస్ట్ వైస్ కెప్టెన్సీని అందుకున్న హిట్ మ్యాన్.. పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నాడు.
టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం విరాట్ కోహ్లీ వారసుడిగా రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే తరుచూ గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యే రోహిత్ శర్మ కెప్టెన్ చేస్తే జట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. కెప్టెన్ అనేవాడు ప్రతీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. రోహిత్‌కు టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే అతనిపై వర్క్‌లోడ్ పెరిగి గాయాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ విమర్శలు చెక్‌పెట్టే విధంగా రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు. విమర్శకుల నోళ్లు మూయించేందుకు ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాలనుకున్న హిట్ మ్యాన్.. పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టేందుకు తాను అర్హుడునేనని చాటి చెప్పేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో చాలా బక్కగా అయిన హిట్ మ్యాన్.. ఫిట్‌గా కనిపిస్తున్నాడని ఎన్‌సీఏకు చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు. 'రోహిత్ శర్మ సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఫిట్‌గా.. సన్నబడేందుకు హిట్ మ్యాన్ చాలా కష్టపడ్డాడు. వైద్యుల సూచనల మేరకు ఏకంగా 6 కిలోల బరువు తగ్గాడు.'అని సదరు అధికారి పేర్కొన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్.. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే వన్డే, టీ20 సిరీస్‌లతో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.