వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. అశ్విన్‌తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన రెడ్ సాయిల్ పిచ్ బాగుందని, ఈ వికెట్‌పై రాణించాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌లో ఓపిక చూపించాలని అభిప్రాయపడ్డాడు.

'ఇదో గొప్ప విజయం. ప్రత్యర్థి పై చేయి సాధించిన తర్వాత కూడా గెలిచాం. సుదీర్ఘ విరామం తర్వాత ఆడినా.. గేమ్‌పై టచ్ పోదు కదా? ఓ వారం క్రితమే ఇక్కడికి వచ్చి ఈ మ్యాచ్ కోసం సన్నదమయ్యాం. అందుకు తగినట్లుగానే ఆశించిన ఫలితాన్ని రాబట్టాం. రిషభ్ పంత్ చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు.
ఆ కఠిన పరిస్థితుల నుంచి బయటపడటం అద్భుతం. అంతేకాకుండా అతను ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రపంచకప్ గెలిచాడు. ఇప్పుడు తనకిష్టమైన ఫార్మాట్‌లో సత్తా చాటాడు. ఈ క్రెడిట్ పూర్తిగా అతనిదే. ఈ మ్యాచ్ కోసం అతను దులీప్ ట్రోఫీ కూడా ఆడాడు. తనదైన రోజున బ్యాట్‌తో అతను ఎలా ఆడుతాడో మాకు బాగా తెలుసు. బ్యాట్‌తోనే కాకుండా గ్లోవ్స్‌తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
పిచ్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా రాణించేలా మా జట్టును మేం సిద్దం చేశాం. స్వదేశంలో ఆడినా.. విదేశాల్లో ఆడినా సత్తా చాటేందుకు మా బౌలర్లు సిద్దంగా ఉంటారు. గత కొన్నేళ్లుగా మేం ఇదే తరహాలో ఆడుతూ విజయాలు సాధిస్తున్నాం. స్పిన్, పేస్ కండిషన్స్ అనే తేడా లేకుండా జట్టు కోసం రాణించేందుకు రెడీగా ఉంటారు.
రెడ్ సాయిల్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కాస్త ఓపికతో ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో కూడా అంతే. బ్యాటింగ్‌లో మేం ఓపికతో ఆడి భారీ స్కోర్లు చేశాం. బౌలింగ్‌లోనూ ఓపికతో సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశాం. ఈ మ్యాచ్‌లో మా విజయానికి ప్రధాన కారణం అశ్విన్. అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ప్రతీసారి అతను జట్టుకు అండగా నిలుస్తున్నాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటుతున్నాడు.
ఇలా చెప్పడం సరైనదో కాదో నాకు తెలియదు కానీ. అతను ఇప్పటికే జట్టు కోసం చాలా చేశాడు. ఎప్పుడూ అతను ఆటకు దూరంగా వెళ్లలేదు. ఐపీఎల్ తర్వాత టీఎన్‌పీఎల్ ఆడాడు. ఆ టోర్నీలో టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడం అతని బ్యాటింగ్ మెరుగయ్యేందుకు ఉపయోగపడింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.