టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఆదివారం కొలంబో వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా సతీసమేతంగా హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చాడు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ ప్లేయర్ వసీం అక్రమ్‌తో కరచాలనం చేయడంతో పాటు హగ్ చేసుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై భారత అభిమానులతో పాటు పాకిస్థాన్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆటగాళ్లు.. పాకిస్థాన్ ప్లేయర్లతో కరాచాలనం చేయడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బాయ్ కట్ చేస్తామని డ్రామా ఆడగా.. ఐసీసీ చర్చలు జరిపి మ్యాచ్‌కు ఒప్పించింది. ఈ సందర్భంగా హ్యాండ్ షేక్ ప్రొటో కాల్ తీసుకురావాలని ఐసీసీని పీసీబీ కోరింది. కానీ భారత ఆటగాళ్లు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో వసీం అక్రమ్‌ను రోహిత్ శర్మ హగ్ చేసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అహ్మద్ షెహజాద్, మహమ్మద్ అమీర్‌లు కూడా ఈ చర్యను తప్పుబట్టారు. ఇది పాకిస్థాన్ అభిమానులను అవమానపర్చడమేనని తెలిపారు. 'మైదానంలో మా జట్టు ఆటగాళ్లు పోరాట పటిమను కోల్పోయారు.
ఒక పక్క మనవాళ్లు దారుణంగా ఓడిపోతుంటే.. మన లెజెండ్స్ ప్రత్యర్థి మాజీ కెప్టెన్‌తో నవ్వుతూ..కౌగిలించుకుంటూ కనిపించడం అభిమానుల గాయాన్ని మరింత పెంచుతోంది. గౌరవం ఉండాలి, కానీ దానికి కూడా ఒక సమయం ఉంటుంది' అని అహ్మద్ షెహజాద్ అసహనం వ్యక్తం చేశాడు.
'మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనవాళ్ల బాడీ లాంగ్వేజ్ చాలా పేలవంగా ఉంది. రోహిత్ శర్మ వచ్చి వసీం భాయ్‌ని హగ్ చేసుకోవడం అతని సంస్కారం కావచ్చు. కానీ పాక్ క్రికెట్ ఇంత పతనమవుతున్న వేళ ఇలాంటి దృశ్యాలు పాక్ అభిమానులకు మింగుడు పడవు.'అని మహమ్మద్ అమీర్ విమర్శలు గుప్పించాడు. మరోవైపు రోహిత్ శర్మ అభిమానులు మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నారు. హిట్ మ్యాన్ క్రీడా స్ఫూర్తిని కొనియాడుతున్నారు. పెద్దలను గౌరవించడంలో రోహిత్ ఎప్పుడూ ముందుంటాడని మద్దతు తెలుపుతున్నారు.