Rohit Sharma: నాకు ఎప్పటికీ విరాట్ కోహ్లీనే కెప్టెన్! అతని సేవలు భారత జట్టుకు అవసరం!

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్న రోహిత్ శర్మ.. తన కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు కోహ్లీ ఎప్పటికీ కెప్టెనేనని, అతని సేవలు భారత జట్టుకు అవసరమన్నాడు. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించింది.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మనే వన్డేలకు సారథిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం పట్ల విరాట్ కోహ్లీ సుముఖంగా లేకున్నా అతని వన్డే కెప్టెన్సీ పీకేసింది. ఇక వన్డే కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించాడు.
తాజాగా బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో మాట్లాడిన రోహిత్ శర్మ .. కోహ్లీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీ వంటి నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరం. టీ20 ఫార్మాట్‌లో 50 ప్లస్ యావరేజ్ అనేది మాములు విషయం కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ భారత్‌ను గెలిపించాడు. అతని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కోహ్లీ క్వాలిటీ, బ్యాట్స్‌మన్‌షిప్ టీమ్‌ను మరోస్థాయికి చేర్చుతుంది.
ఇప్పటికీ అతను జట్టులో కెప్టెన్‌గానే భావిస్తా. అలాంటి సారథిని కోల్పోవడానికి ఏ కెప్టెన్ కూడా ఇష్టపడడు. జట్టులో అతను ఉండటం ఎంతో అవసరం. ఇక ఆటగాడిగా ఎన్ని సెంచరీలు బాదినా.. పరుగులు చేసినా చాంపియన్‌షిప్ గెలవడమే ముఖ్యం. అయితే టైటిల్ గెలవాలంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు. జట్టుగా రాణించాల్సిందే.'అని హిట్ మ్యాన్ అభిప్రాయపడ్డాడు.
2023 వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా కొనసాగాలని భావించిన కోహ్లీ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి పీకేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోని కోహ్లీ పెద్ద తప్పు చేశాడని, ఆ తప్పిదంతో ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని విశ్లేషకులు అంటున్నారు.
అంతేకాకుండా ఐసీసీ టైటిల్ గెలవకపోవడం, గత రెండేళ్లుగా బ్యాటింగ్ పరంగా విఫలవవుతుండటంతో అతన్ని పక్కనపెట్టడమే ఉత్తమమని బోర్డు పెద్దలు భావించారు. ఫార్మాట్‌కో కెప్టెన్ కారణంగా ఆటగాళ్లలో గందరగోళం నెలకొంటుందని, అందుకే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఒక్కడే కెప్టెన్‌గా ఉండాలని బోర్డు భావించిందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. అందుకే రోహిత్ శర్మకు వన్డే సారథ్య బాధ్యతల కట్టబెట్టారని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications