మలి.. నువ్వు సూపరో సూపర్..
మలింగా రిటైర్మెంట్ సందర్భంగా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అతనికి అభినందనలు తెలుపుతున్నారు. మలింగా బౌలింగ్‌ను గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ట్విటర్ వేదికగా మలింగా రిటైర్మెంట్‌పై స్పందించాడు.
ఐపీఎల్‌లో ముంబై నాలుగుసార్లు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మలింగను చాంపియన్ అంటూ హిట్ మ్యాన్ కొనియాడాడు. 'మలి.. నువ్వో చాంపియన్ క్రికెటర్‌లా ఆడావు. నీ అద్భుతమైన కెరీర్‌లో అమోఘమైన ప్రదర్శన చేశావు. ఇకపై నీ జీవితం మరింత బాగుండాలని ఆశిస్తున్నా. హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు.

ప్రత్యేకమైన శైలితో..
భిన్న రంగులతో రింగులు తిరిగిన జుట్టు, బంతిని ముద్దాడిన తర్వాతే మొదలయ్యే రనప్, గతంలో ఎన్నడూ చూడని 'రౌండ్ ఆర్మ్' బౌలింగ్ యాక్షన్ మలింగను సగటు క్రికెట్ అభిమాని భిన్నంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా '45 డిగ్రీల' యాక్షన్ కారణంగా మలింగ వేసే యార్కర్లు బుల్లెట్లలా దూసుకొస్తుంటే ఆడలేక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం లెక్కలేనన్ని సార్లు జరిగింది.
వాటికి వేగం తోడైతే అవి మరింత ప్రమాదకరంగా మారి మలింగ స్థాయి ఏమిటో చూపించాయి. యార్కర్లు మాత్రమే కాకుండా తర్వాతి రోజుల్లో మలింగ స్లో బాల్, స్లో బౌన్సర్‌లను అద్భుతంగా వేయడం నేర్చుకొని ప్రత్యర్థులను పడగొట్టాడు.

అత్యధిక హ్యాట్రిక్‌లు..
డెత్ ఓవర్లలో అతనికంటే మెరుగైన రికార్డు మరే బౌలర్‌కు లేదు. గత దశాబ్ద కాలంలో పరిమిత ఓవర్లలో శ్రీలంక జట్టుకు అతని అనేక విజయాలు అందించాడు. 2009, 2012 టి20 ప్రపంచకప్ జట్లలో భాగంగా ఉన్న మలింగ కెప్టెన్సీలోనే 2014లో శ్రీలంక టి20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలవడం విశేషం.
సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్‌లాంటి స్టార్లు ఉన్నా ... 2007 నుంచి 2014 మధ్య లంక జట్టు ఐసీసీ టోర్నీ లో మంచి ప్రదర్శన కనబర్చడంలో అతనిదే కీలకపాత్ర. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా ఐదు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన అరుదైన రికార్డు అతని పేరిటే ఉంది.

ఐపీఎల్‌లో సూపర్...
శ్రీలంక తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసిన మలింగ భారత అభిమానులకు ఐపీఎల్ ద్వారా మరింత చేరువయ్యాడు. ముంబై ఇండియన్స్ 4 సార్లు (2013, 2015, 2017, 2019) ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఈ లీగ్‌లో 2009 నుంచి 11 సీజన్ల పాటు అతను ఒకే ఒక జట్టు ముంబైకే ప్రాతినిధ్యం వహించాడు. 122 ఐపీఎల్‌లో మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఓవరాల్‌గా 295 టీ20ల్లో అతను 7.07 ఎకానమీతో 390 వికెట్లు తీశాడు.

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు..
4 బంతుల్లో 4 వికెట్లు రెండు సార్లు తీసిన ఘనత మలింగాదే. 2007 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 45వ ఓవర్ చివరి రెండు బంతుల్లో పొలాక్, హాల్‌లను ఔట్ చేసిన అతను, 47వ ఓవర్ తొలి రెండు బంతుల్లో కలిస్, ఎన్తినిలను పెవిలియన్ పంపించాడు. అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును దాదాపు 12 ఏళ్ల పాటు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. 2019లో పల్లెకెలెలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ మూడో ఓవర్లో మలింగ వరుసగా మున్రో, రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను ఔట్ చేసి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.


Click it and Unblock the Notifications












