కొలంబో: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ తమ బౌలింగ్‌ను ఎంతో మెరుగుపరుచుకున్నారని కొనియాడాడు. ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శన వెనుక ఎంతో శ్రమ దాగి ఉందని తెలిపాడు.
ఆసియాకప్ 2023లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే ఈ మ్యాచ్‌లో గెలిచామని చెప్పుకొచ్చాడు.

ఈ లోస్కోరింగ్ గేమ్‌లో ఎదురైన సవాళ్లను ఆస్వాదించామని తెలిపాడు. 'ఇదో అద్భుతమైన గేమ్. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై తీవ్ర ఒత్తిడిలో ఆడటం సవాల్‌తో కూడుకున్నది. చాలా అంశాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. మా సత్తా ఏంటో తెలుసుకోవడానికి ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు ఎదురు చూస్తున్నాం. ఈ మ్యాచ్‌లో ఎదురైన సవాల్‌ను ఆస్వాదించాం.
గత కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. రాత్రికి రాత్రే అతని బౌలింగ్ మెరుగవ్వలేదు. ప్రస్తుతం అతన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రతీ బంతికి వికెట్ తీసే బౌలర్‌లా కనిపిస్తున్నాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్న పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అంత సులువైన పని కాదు. ఒకే ప్లేస్‌లో నిలకడగా బంతిని వేసి వికెట్లు రాబట్టాం.
కుల్దీప్ యాదవ్ సైతం హార్దిక్ పాండ్యా ఎంతో కష్టపడ్డాడు. గతేడాదిగా అసాధారణంగా బౌలింగ్ చేస్తున్నాడు. రిథమ్ అందుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. తప్పులను సరిదిద్దుకున్నాడు. గత 10 వన్డేల్లో అతని ప్రదర్శన చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.