అతని వల్లే ఈ విజయం.. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం: రోహిత్ శర్మ

బర్మింగ్‌హామ్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ కారణంగానే తమకు విజయం దక్కిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తీవ్ర ఒత్తిడిలో జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతను అదే జోరును ఇక్కడ కొనసాగించాడని చెప్పాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ విజయంతో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. భారత ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. నేడు(ఆదివారం) జరిగే చివరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశాడు.

జడేజా సూపరో సూపర్..
'ఇంగ్లండ్ ఓ జట్టుగా ఎంత ప్రమాదకరమైనదో మాకు బాగా తెలుసు. ఇంగ్లండ్‌లోనే కాదు ఎక్కైడానా ఆ జట్టు సత్తా చాటగలదు. అయితే విజయాలు ఎప్పుడూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆటగాళ్ల ఫీలింగ్‌ను కూడా మారుస్తాయి. తొలి టీ20 విజయం తర్వాత జట్టుగా మేం ఎలా రాణిస్తామో చూడాలనుకున్నా. అలాగే ఈ మ్యాచ్ జట్టుగా మాకు ఓ సవాల్‌గా భావించా. తీవ్ర ఒత్తిడిలో జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మాలో ఎవరైనా ఒకరు చివరి వరకు క్రీజులో ఉండి పరుగులు చేయాలనుకున్నాం. ఆ బాధ్యత జడేజా తీసుకున్నాడు. ఇక్కడే టెస్ట్‌లో సెంచరీ బాదిన అతను అదే జోరును కొనసాగించాడు.

బెంచ్ ఆటగాళ్లకు చాన్స్..
అతను చాలా ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు కావాల్సిన లక్ష్యాన్ని అందించాడు. ఇక పవర్ ప్లే ప్రాధాన్యత ఏంటో మేం అర్థం చేసుకున్నాం. అది పరుగులు చేయడమైనా.. వికెట్లు తీయడమైనా ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇదే జోరులో చివరి మ్యాచ్‌లో సత్తా చాటాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. నేను ఈ విషయంపై కోచ్‌తో చర్చిస్తా. వరుస విజయాలతో మేం ఇదే జోరును కొనసాగించడం అవసరం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు), రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు జోర్డాన్ (4/27), గ్లీసన్ (3/15) అదరగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ విల్లే (22 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరువు నిలిపే పరుగులు చేశారు. భువనేశ్వర్ (3/15), బుమ్రా (2/10), యజువేంద్ర చహల్ (2/10)ల నమ్మశక్యంకాని బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications