ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ర్యాన్ రికెల్టన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 81), రోహిత్ శర్మ(38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్(3/39) సత్తా చాటాడు. పేలవ బౌలింగ్‌తో కేకేఆర్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తడబడ్డాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు చేయడంలో విఫలమయ్యాడు. దాంతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి దిగి బౌలింగ్ మార్పులు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన కేకేఆర్ ఓపెనర్లు అజింక్యా రహానే, ఫిన్ అలెన్‌లకు రోహిత్ తన వ్యూహాంతో అడ్డుకట్ట వేసాడు. ఐదు ఓవర్లకే 70 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీయడంలో హార్దిక్ పాండ్యా విఫలమవ్వగా.. రోహిత్ తన అనుభవాన్ని ఉపయోగించి ఫలితాన్ని రాబట్టాడు.

ఆరో ఓవర్‌ను శార్దూల్ ఠాకూర్‌తో వేయించాలని హార్దిక్ పాండ్యాకు సూచించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రెండో బంతికే డేంజరస్ ఫిన్ అలెన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫిన్ అలెన్ ఔటవ్వకుండా ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే కేకేఆర్ భారీ స్కోర్ చేసేది. కానీ రోహిత్ తన అనుభవంతో అతనికి కళ్లెం వేసాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 'రాజు ఎక్కడున్నా రాజేరా'.. అని అభిప్రాయపడుతున్నారు.
ఆ తర్వాత కూడా హార్దిక్‌కు రోహిత్ కొన్ని సలహాలు ఇచ్చాడు. డెత్ ఓవర్లలో బుమ్రాను తీసుకొచ్చే విషయంతో పాటు హార్దిక్‌కు బౌలింగ్ ఎప్పుడో చేయాలో కూడా చెప్పాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించాడు. మ్యాచ్ జరుగుతుండగానే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసిన హార్దిక్‌ను మందలిస్తూ కనిపించాడు. 'నేనేం చెప్పినా.. నువ్వు ఏం చేస్తున్నావ్?'అని అన్నట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది.
ఫీల్డింగ్ సమయంలో డగౌట్‌కే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్‌తో కూడా హార్దిక్ చర్చిస్తూ కనిపించాడు. ముఖ్యంగా బ్యాటర్లకు ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలనే విషయంలో ఈ ఇద్దరు చర్చించుకున్నట్లు కనిపించింది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తడబడినా.. జట్టు నిండా సారథులు ఉండటంతో ముంబై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
హార్దిక్ పాండ్యా కూడా.. తన సహచర ఆటగాళ్ల సలహాలను స్వీకరిస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే తాను పేరుకే కెప్టెన్ అని, జట్టు నిండా సారథులు ఉన్నారని తెలియజేశాడు. అందుకు తగ్గట్లుగానే వారి సలహాలను పాటించాడు.