
వచ్చే వారం నుంచి..
'హార్దిక్ పాండ్యా రోజు రోజుకు మెరుగవుతున్నాడు. వచ్చే వారం అతను బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అయితే అతను బౌలింగ్ చేసే విషయం డాక్టర్లు, ఫిజియోలు మాత్రమే చెప్పగలరు. అతను ఇప్పటి వరకు అయితే బౌలింగ్ చేయలేదు. అతని బౌలింగ్ సంబంధించి ఫిజియో, ట్రైనర్లు, మెడికల్ టీమ్ వర్క్ చేస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు అతను ఒక్క బాల్ కూడా బౌలింగ్ చేయలేదు. ఇక బ్యాటింగ్‌లోను అతను విఫలమయ్యాడనేది కాదనలేని సత్యం. ఈ విషయంలో అతను కూడా నిరాశతోనే ఉన్నాడు.

ఒక్క ఇన్నింగ్స్ చాలు..
అతని నైపుణ్యం ఏంటో మాకు తెలుసు. ఈ కఠిన పరిస్థితుల్లో నుంచి అతను పుంజుకుంటాడనే విషయంలో సందేహం లేదు. అతని పట్ల టీమ్ నమ్మకంగా ఉంది. వ్యక్తిగతంగాను నాకు అతనిపై నమ్మకం ఉంది.మైదానంలోకి వెళ్లిన ప్రతీసారి అతను మెరుగయ్యాడు. పాండ్యా లాంటి ఆటగాడికి ఫామ్ అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది. గతంతో కూడా అతను ఇలాంటి పరిస్థితుల నుంచి కమ్ బ్యాక్ చేశాడు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన తమ జట్టు.. ఈ సారి ప్లే ఆఫ్స్‌కి చేరకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. కానీ, గత ఆరేళ్లలో నాలుగు సార్లు విజేతగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

నిరాశకు గురయ్యాం..
'ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు మాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడం నిరాశకు గురయ్యాం. ముంబై లాంటి జట్టు ఆడుతున్నప్పుడు మంచి ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తారు. నేను దానిని ఒత్తిడిగా భావించను.. అవి అంచనాలు మాత్రమే. ఇషాన్ కిషన్ ప్రతిభ ఉన్న ఆటగాడు. అతను బ్యాటింగ్ చేయడానికి సరైన స్థానం చాలా కీలకం. ఓపెనింగ్ చేయడం అతనికి నచ్చుతుంది. డగౌట్‌లో కూర్చుని ఇషాన్ ఆడుతుంటే చూడటం అద్భుతంగా ఉంది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన ఇషాన్, సూర్య..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84), సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. హోల్డర్‌కు 4 వికెట్లు దక్కగా... నబీ 5 క్యాచ్‌లు అందుకొని ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఫీల్డర్‌గా నిలిచాడు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ మనీశ్ పాండే (41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), జేసన్ రాయ్ (21 బంతుల్లో 6 ఫోర్లతో 34) రాణించారు.


Click it and Unblock the Notifications
