
హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజీత్‌ను టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ చేశాడు. అభిజీత్‌కు హిట్ మ్యాన్ అద్భుతమైన గిఫ్ట్ పంపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ.. ఈ బిగ్‌బాస్ బిగ్ ఫ్యాన్‌ను ఫోన్‌లో పలకరించాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు అభినందించాడు. వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాన్ని అభిజీతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
ఆసీస్ పర్యటనలో ఉన్న తెలుగు క్రికెటర్ హనుమ విహారీ, రోహిత్ శర్మ మధ్య జరిగిన ఓ సంభాషణలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 చర్చకు వచ్చిందంట.
ఈ సందర్భంగా విహారి బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ గురించి చెప్పాడట. అంతేకాకుండా నీకు అతను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడట. దాంతో ఈ బిగ్‌బాస్ విన్నర్‌ను అభినందిస్తూ రోహిత్ శర్మ తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్... రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు.
అంతేకాకుండా రోహిత్ శర్మ అంటే పిచ్చెక్కిపోయే తనకు తన ఫేవరెట్ క్రికెటర్ నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. తనకు హెల్ప్ చేసిన హనుమవిహారికి ధన్యవాదాలు చెప్పాడు. చిన్నప్పుడు తాను క్రికెటర్ అవ్వాలనుకున్నానని, కానీ కుదర్లేదని ఈ సందర్భంగా అభిజిత్ మరో విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందుకోవడంతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని తెలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాకు విజయం వరించాలని, అందరూ మద్దతుగా నిలవాలని అభిజిత్ పిలుపునిచ్చాడు. ఇక రోహిత్ శర్మ అమ్మగారిది విశాఖపట్నం అన్న విషయం తెలిసిందే. అతనికి తెలుగు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ టాలీవుడ్‌ను ఫాలో అవుతుంటాడు.