
చెన్నై: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తన అభిమాన క్రికెటర్లను దూషించాడనే కారణంతో స్నేహితుడినే చంపేసాడు ఓ క్రికెట్ అభిమాని. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి మీడియా వివరాల ప్రకారం గత గురువారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడితో పాటు చనిపోయిన వ్యక్తి ఇద్దరూ మంచి స్నేహితులని, మద్యం సేవిస్తూ.. భారత క్రికెట్ జట్టు గురించి చర్చించుకున్నారని సమాచారం.
అయితే వాడి వేడిగా ఈ చర్చ జరగ్గా.. సహనం కోల్పోయిన నిందితుడి స్నేహితుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బండ బూతులు తిట్టాడని తెలుస్తోంది. తమ అభిమాన క్రికెటర్లను తిట్టడం సహించలేకపోయిన నిందితుడు మద్యం మత్తులో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చంపుకునేంత అభిమానం ఏంట్రా? అని కామెంట్ చేస్తున్నారు. పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనని, దేశం ఎటుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో క్రికెట్‌ను మతంలా ఆరాధిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అభిమాన క్రికెటర్ల కోసం కొట్టుకున్న ఘటనలు ఉన్నాయే తప్పా చంపుకోవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో బ్యానర్లు, కటౌట్ల విషయంలో విరాట్, రోహిత్, ధోనీ అభిమానులు కొట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అయితే రోజూ తిట్టుకుంటారు. కానీ చంపుకున్న ఘటనలు అయితే లేవు. తాజా ఘటన.. యావత్ క్రికెట్ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది.
ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో ఉంది. టీ20 ప్రపంచకప్ కోసం సన్నదమవుతోంది. అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ ప్రపంచకప్ వేటను మొదలుపెట్టనుంది. ధోనీ సారథ్యంలో అరంగేట్ర టీ20 ప్రపంచకప్ (2007) గెలుచుకున్న టీమిండియా.. మరో టైటిల్ అందుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైన టైటిల్ గెలిచి 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే కసితో ఉంది.