ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26ని భారీ శతకంతో ప్రారంభించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా జైపూర్ వేదికగా శుక్రవారం ఉత్తరఖాండ్‌తో జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్ మ్యాన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. తొలి ఓవర్‌లోనే ఎదొర్కొన్న తొలి బంతికే రోహిత్ శర్మ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఉత్తరఖాండ్ బౌలర్ దేవంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగ్‌మోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి రోహిత్(0) వెనుదిరిగాడు. దాంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేందుకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు అభిమానులు ఉదయం 7 గంటల నుంచే స్టేడియం బయట పడిగాపులు కాచారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మరో రెండు స్టాండ్స్‌లోకి అభిమానులను అనుమతించింది. కానీ వారిని రోహిత్ తీవ్రంగా నిరాశపర్చాడు.

7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన రోహిత్.. సిక్కింతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తనదైన దూకుడుతో 61 బంతుల్లోనే శతకం సాధించి ఈ టోర్నీలో ఈ ఘనతను అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డ్ సాధించాడు. హిత్ శర్మకు ఇది 37వ లిస్ట్ ఏ సెంచరీ కాగా.. కెరీర్‌లో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ శతకం. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ తనదైన శైలిలో చెలరేగాడు.
రోహిత్ చివరిసారిగా 2018 అక్టోబర్‌లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. హైదరాబాద్‌తో సెమీఫైనల్లో బరిలోకి దిగాడు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ హజారే ట్రోఫీ ఆడిన రోహిత్.. సిక్కింతో తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించాడు. 17 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టాడు. అతను చివరిసారిగా 2008లో గుజరాత్‌పై 115 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రోహిత్(94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్‌లతో 155) భారీ శతకంతో ఈ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. అశిష్ తాపా(79) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లకు 237 పరుగులు చేసి గెలుపొందింది. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ దక్కింది.
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో భారత ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధనతో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లు ఈ టోర్నీ ఆడుతున్నారు. రోహిత్, కోహ్లీలు రెండు మ్యాచ్‌లు ఆడుతారని వార్తలు వచ్చాయి. తొలి మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రోహిత్.. రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు.
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తోనే అతను మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.