అందుకే శ్రేయస్ అయ్యర్‌ను ఆడించలేదు: రోహిత్ శర్మ

కోల్‌కతా: సరైన్ టీమ్ కాంబినేషన్ కోసమే శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన తొలి టీ20 భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడైన శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఇక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టడంపై తాజాగా రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

బౌలింగ్ కోసమే..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. అయ్యర్‌ను పక్కనపెట్టడానికి గల కారణాలను వెల్లడించాడు.'శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాడిని పక్కన పెట్టడం కాస్త కష్టమే. కానీ, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగల ఆటగాడు జట్టుకు చాలా అవసరం. అందుకే అతడిని పక్కనపెట్టక తప్పలేదు. శ్రేయస్ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రపంచకప్ జట్టులో అతనికి కచ్చితంగా చోటు ఉంటుంది. జట్టుకు ఏం కావాలో ఆటగాళ్లకు బాగా తెలుసు.

అందరికి అవకాశం ఇవ్వలేం..
ఆటగాళ్లంతా అందుబాటులో ఉన్నప్పుడూ.. ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఆటగాళ్లూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తుది జట్టు ఎంపికలో చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంంది. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణించే ఆటగాళ్ల విషయంలో మాకు క్లారిటీ ఉంది. యువ ఆటగాళ్లు కూడా జట్టు విజయాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నా. ఇషాన్ కిషన్ చాలా కాలంగా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అతను ఓపెనర్‌గానే బరిలోకి దిగుతున్నాడు'అని రోహిత్ శర్మ తెలిపాడు.

అదరగొట్టిన బిష్ణోయ్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కీరన్ పోలార్డ్(24 నాటౌట్), కైల్ మేయర్స్(34) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ రవి బిష్ణోయ్(2/17), హర్షల్ పటేల్(2/37) రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ హిట్టింగ్..
అనంతరం భారత్ 18.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 162 పరుగులు చేసి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40)ధాటిగా ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), వెంకటేశ్ అయ్యర్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications