అహ్మదాబాద్: ఫీల్డ్ అంపైర్ అడగడంతోనే కండలు చూపించానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-0కు పెంచుకొని అష్ట దిగ్భంధం చేసింది.
రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా విజయం సులువైంది. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్.. దిశల్లో రోహిత్ శర్మ బాదిన సిక్స్‌లు ఆకట్టుకున్నాయి.

విధ్వంసకర బ్యాటింగ్‌తో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ అనంతరం అంపైర్‌కు కండలు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. నవ్వుతూ అంపైర్‌కు కండలు చూపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశ్నించగా.. రోహిత్ శర్మ అసలు కారణాన్ని వెల్లడించాడు.
'భారీ సిక్సర్లను చూసి ఆశ్చర్యపోయిన అంపైర్.. ఇంత అలవోకగా ఎలా కొడుతున్నావని అడిగాడు. నీ బ్యాట్‌లో ఏం ఉందని పరిశీలించాడు. ఇందులో ఏమో ఉందని సందేహించాడు. నేను వెంటే బ్యాట్‌లో ఏం లేదని నా కండ బలమని చెప్పాను'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.
ఈ విజయంతో భారత్ వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.