జట్టులోని సహచర ఆటగాళ్లను తన కుటుంబ సభ్యుల్లా చూసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో తన కెప్టెన్సీ వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఇదేనని, ఆటగాళ్లందరితో ఓ స్నేహితుడిలా చనువుగా ఉండటం కలిసొచ్చిందన్నాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ అమెరికాలో పర్యటిస్తున్నాడు.
పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కెప్టెన్ అనేవాడు ఆటగాళ్లందరి కంటే ముందుండి జట్టును నడిపించడం ముఖ్యం. జట్టులోని సహచర ఆటగాళ్లందరికి ఓ ఉదహారణగా ఉండాలి. కెప్టెన్‌గా నా సహచరులకు ఉదహారణగా ఉండేందుకు నేనెప్పుడూ ప్రయత్నిస్తాను.

మైదానంలో ఎలా ఉన్నావనేది ఒక్కటే ముఖ్యం కాదు. ఆఫ్ ది ఫీల్డ్‌లో కూడా ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండాలి. నేను మా ఆటగాళ్లను మా కుటుంబ సభ్యుల్లా చూసేవాడిని. స్నేహితుడిలా వారితో చనువుగా ఉండేవాడిని. అందరికి సమానంగా బాధ్యతలను పంచేవాడిని. జట్టును ఓ ఇంటి వాతావరణంలా మార్చితే మనం ఆశించిన విజయాలు దక్కుతాయి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పనులతోనే కెప్టెన్‌గా ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్‌ను అందుకుంది. ఈ విజయానంతరం రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినా.. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 'నేను ఎక్కువగా ఆలోచించను. ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. కొంతకాలం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నా ఆట చూస్తారు'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలోనూ భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించిన విషయం తెలిసిందే.