
బర్మింగ్‌హామ్: ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహనం కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో ఫీల్డర్ తప్పిదానికి ఆగ్రహానికి గురైన హిట్‌మ్యాన్ అతన్ని బూతులు తిట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్ అనంతరం రోహిత్ శర్మ ఫీల్డర్‌కు తన పొజిషన్ గురించి చెబుతున్నాడు.
అయితే రోహిత్ మాటలను సదరు ఫీల్డర్ పట్టించుకోలేదు. దాంతో చిర్రెత్తుకుపోయిన హిట్ మ్యాన్.. నోటికి పనిచెప్పాడు. 'నేను మాట్లాడేటప్పుడు నన్నే చూడాలి'అని హిందీలో బండబూతులు తిట్టాడు. ఇవి కాస్త స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు రోహిత్ ప్రశాంతంగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 49 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు), రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు జోర్డాన్ (4/27), గ్లీసన్ (3/15) అదరగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ విల్లే (22 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరువు నిలిపే పరుగులు చేశారు. భువనేశ్వర్ (3/15), బుమ్రా (2/10), యజువేంద్ర చహల్ (2/10)ల నమ్మశక్యంకాని బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ కారణంగానే తమకు విజయం దక్కిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తీవ్ర ఒత్తిడిలో జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతను అదే జోరును ఇక్కడ కొనసాగించాడని చెప్పాడు. విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. భారత ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. నేడు(ఆదివారం) జరిగే చివరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని హింట్ ఇచ్చాడు.