పేలవ బ్యాటింగ్‌తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. తమ ఓటమిపై స్పందించాడు. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే(6/33) అసాధారణ బౌలింగ్‌తో తమ పతనాన్ని శాసించాడని చెప్పాడు. అతని వల్లనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని అభిప్రాయపడ్డాడు.

'మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది నిరాశకు గురిచేస్తోంది.తొలి 10 ఓవర్లు ఆడితే సరిపోదు. చివరి వరకు నిలకడగా ఆడటం చాలా కీలకం. ఈ రోజు మేం సమష్టిగా విఫలమయ్యాం. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఇలాంటి పరాజయాలు సహజమే. కండిషన్స్ అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే స్ట్రైక్ రొటేట్ చేయవచ్చని భావించాం.
జెఫ్రీ వాండర్సే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 వికెట్లు తీసిన అతనిదే ఈ గెలుపు క్రెడిట్. నేను ఆడిన విధానంతోనే 65 పరుగులు చేయగలిగాను. నేను అలా దూకుడుగా ఆడితే చాలా రిస్క్‌లు తీసుకుంటాను. ఈ పిచ్ యొక్క స్వభావం మేం అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఈ వికెట్‌పై ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. ఈ రోజు మేం రాణించలేకపోయాం. ఈ వైఫల్యాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మిడిలార్డ్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 3 ఫోర్లతో 35), అక్షర్ పటేల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రె వండర్సే 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. చరిత్ అసలంక(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు.