Rohit Sharma: ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం!
Rohit Sharma, WC 2023 Final: ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగ్‌తోనే ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తమ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసినా.. ఈ ఇద్దరూ అసాధారణ భాగస్వామ్యంతో తమ ఓటమిని శాసించారని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత్ మరోసారి టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. 20-30 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు.

'ఈ రోజు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. మా ప్రదర్శన కూడా అంత గొప్పగా లేదు. కానీ ఈ టోర్నీలో జట్టు రాణించిన తీరు పట్ల గర్వపడుతున్నా. ఈ మ్యాచ్‌లో మేం గెలవాల్సింది. బ్యాటింగ్‌లో 20-30 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేది. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేం 270-280 పరుగులు చేస్తామని అనుకున్నా.
కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో 240 పరుగులే చేయగలిగాం. బౌలింగ్‌లో ఆరంభంలోనే వికెట్లు తీయాలనుకున్నాం. ప్రణాళికలకు తగ్గట్లే మూడు వికెట్లు పడగొట్టాం. కానీ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగ్‌తో మా విజయవకాశాలను దెబ్బతీసారు. అండర్ ద లైట్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ విషయం మాకు తెలుసు. కానీ మా ఓటమికి ఇదే కారణమని సాకుగా చెప్పడం లేదు. మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. . విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications