టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి భారత సారథిగా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను విజేతగా నిలవడంతో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
టీమిండియా కెప్టెన్‌గా గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 అందించిన రోహిత్ శర్మ.. 9 నెలల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలబెట్టాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించలేదు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.

తొలి కెప్టెన్ రోహిత్..
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 76 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న నాలుగో సారథిగా నిలిచాడు.
ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయడ్(1975 వన్డే ప్రపంచకప్), రికీ పాంటింగ్(2003 వన్డే ప్రపంచకప్), మహేంద్ర సింగ్ ధోనీ(2011 వన్డే ప్రపంచకప్), రోహిత్ శర్మ(ఛాంపియన్స్ ట్రోఫీ 2025) కంటే ముందున్నారు.
నాలుగో కెప్టెన్‌గా..
అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. నాలుగు ఐసీసీ టైటిళ్లతో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా 2003 వన్డే ప్రపంచకప్, 2007 వన్డే ప్రపంచకప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయడ్ 1975 వన్డే ప్రపంచకప్‌తో పాటు 1979 వన్డే ప్రపంచకప్ గెలిచాడు. ప్యాట్ కమిన్స్ 2023 డబ్ల్యూటీసీ, 2023 వన్డే ప్రపంచకప్ సాధించాడు. తాజాగా రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఆటగాడిగా రోహిత్ శర్మకు ఇది నాలుగో ఐసీసీ టైటిల్. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సొంతం చేసుకున్నాడు.