ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌కు దూరంగా ఉండటంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తనను ఎవరూ తుది జట్టు నుంచి తప్పించలేదని, తానే స్వయంగా తప్పుకున్నానని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ ఆలోచనే లేదన్నాడు. ల్యాప్ టాప్ ఉన్న బయటి వ్యక్తులు, కామెంటేటర్లు తన రిటైర్మెంట్‌ను నిర్ణయించలేరన్నాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ తప్పుకోవడంతో అతని కెరీర్ ముగిసిందని, రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వచ్చాయి. రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ.. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు.

రిటైర్మెంట్ ఆలోచనే లేదు..
'ఈ మ్యాచ్‌కు దూరమైనంత మాత్రానా రిటైర్మెంట్ ప్రకటిస్తానని కాదు. సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా ఉండాలనుకోవడం లేదు. కానీ బ్యాట్‌తో పరుగులు చేయలేకపోతున్నాను. అందుకే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. నేను పరుగులు చేయడానికి మరో 2 నెలలా? లేదా 5 నెలలా? సమయం పడుతుందా? అని గ్యారెంటీ ఇవ్వలేను.
నేను ఇప్పటికే చాలా క్రికెట్ చూశాను. ప్రతి నిమిషం, ప్రతి సెకను, రోజువారీ జీవితంలో మార్పు ఉంటుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని నేను నమ్ముతాను. కానీ అదే సమయంలో నేను కూడా వాస్తవికంగా ఉండాలి. కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న వ్యక్తులు లేదా ల్యాప్‌టాప్‌లో కథనాలు రాసేవారు నా జీవితం ఎలా సాగుతుందో నిర్ణయించలేరు.
నాకు బుర్ర ఉంది..
నేను సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్నాను. నేను ఎప్పుడూ ఆడుతాను, ఎప్పుడు కెప్టెన్‌గా ఉంటాను, ఎప్పుడు తప్పుకుంటాను అనే విషయాన్ని ఎవరూ నిర్ణయించలేరు. నాకు కాస్త తెలివి ఉంది. పరిణితి కలిగిన వ్యక్తిని. ఇద్దరు పిల్లల తండ్రిని. నాకు బుర్ర ఉంది. నా జీవితంలో ఏం కావాలో నాకు తెలుసు.'అని రోహిత్ విమర్శకులపై అసహనం వ్యక్తం చేశాడు.
ఇక సిడ్నీ టెస్ట్ నుంచి విశ్రాంతి ఇచ్చారా? తప్పించారా? మీరే తప్పుకున్నారా? అని హోస్ట్ ప్రశ్నించగా.. ఈ మూడు కాదని రోహిత్ బదులిచ్చాడు. తనని ఎవరూ తప్పించలేదని, తానే తప్పుకున్నానని తెలిపాడు. 'ఈ మూడు కాదు. నేనే తప్పుకున్నాను. సెలెక్టర్లు, కోచ్‌లకు నేనే సమాచారమిచ్చాను. నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. ఈ మ్యాచ్‌కు నేను దూరంగా ఉంటానని చెప్పాను. ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. నేను ఫామ్‌లో లేను. మనకు ఫామ్‌లో ఉన్న ఆటగాడు అవసరం. బ్యాటింగ్ ఆర్డర్ గొప్ప ఫామ్‌లో లేదు. కాబట్టి నేను తప్పుకోవడమే ఉత్తమమని కోచ్, సెలెక్టర్లకు వివరించాను.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
Question - reports were there you were rested, dropped or opted out?
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2025
Rohit Sharma - none, I stood down. I told the selectors and coach that runs are not coming from my bat, so I decided to step away. pic.twitter.com/hAHKW7BJx9