
ఫ్లోరిడా: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33) అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు.
విండీస్‌తో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. గేల్ తర్వాత రోహిత్(477) ఉండగా.. అఫ్రిది(476) మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 44) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రోహిత్ శర్మ, సంజూ శాంసన్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో అక్షర్ పటేల్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్‌కాయ్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల హోసెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ప్రపంచకప్ నేపథ్యంలోనే ఆటగాళ్ల సత్తా పరీక్షించడానికే అవకాశం కల్పిస్తున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ కారణంగానే ఈ మ్యాచ్‌లో మూడు మార్పులు చేశామని పేర్కొన్నాడు. 'మేం కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లం. పిచ్ ఎలా ఉంటుందో అనేది తెలియదు. మేమైతే భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంటున్నాం. టీమ్ బలహీనతలను అధిగమించాల్సిన అవసరం ఉంది.
మంచి ప్రదర్శన ఇచ్చేందుకు మేం మా సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఓ జట్టుగా మేం ఎలాంటి ప్రమాణాలు నెలకొల్పామో తెలుసు. కుర్రాళ్లకు అవకాశాలిస్తున్నాం. వారి ఆత్మవిశ్వాసం పెంచడం ముఖ్యం. అందుకే వీలైనన్ని అవకాశాలు ఇస్తున్నాం. వారి సత్తాను పరీక్షిస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ జట్టులోకి రాగా.. హార్దిక్ పాండ్యా, రవి అశ్విన్, అయ్యర్ ఉద్వాసనకు గురయ్యారు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.