
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20ల్లో సొంతగడ్డపై అత్యధిక విజయాలందుకున్న సారథిగా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌లను అధిగమించాడు. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్లతో భారత్ విజయం సాధించడంతో హిట్ మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు భారత గడ్డపై కెప్టెన్‌గా రోహిత్ శర్మ 16 విజయాలందుకున్నాడు. ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్ 15 విజయాలతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఇప్పటికే స్వదేశంలో టీ20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లి(13), ఎంఎస్ ధోనీ(10)లను రోహిత్ ఎప్పుడో దాటేశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం విశేషం. ఇక టీమిండియాకు పొట్టి ఫార్మాట్‌లో వరుసగా 11వ విజయం. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గనిస్థాన్‌పై గెలుపుతో మొదలైన విజయాల పరంపరను టీమిండియా దిగ్విజయంగా కొనసాగిస్తుంది.
కెప్టెన్‌గా కాకుండా ఓ ప్లేయర్‌గా కూడా రోహిత్ రికార్డు నమోదు చేశాడు. సొంతగడ్డపై ఎక్కువ విజయాలందుకున్న ఆటగాడిగా కూడా రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్లేయర్‌గా ఇప్పటి వరకు 32 విజయాలందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ప్లేయర్స్ మార్టిన్ గప్టిల్(31), టీమ్ సౌథీ(27)లను అధిగమించాడు.
శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 నాటౌట్) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.
అనంతరం భారత్ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.