టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డ్ ఉంది. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో ఈ సీనియర్ ఆటగాళ్లకు తిరుగులేదు. ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్‌తో పాటు కోహ్లీ, రోహిత్ టాప్-3లో ఉన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ టెండూల్కర్ 71 మ్యాచ్‌లు ఆడి 44.59 సగటుతో 3077 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 175. విరాట్ కోహ్లీ 50 మ్యాచ్‌ల్లో 54.56 సగటుతో 2,451 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు ఉండగా.. అత్యధిక స్కోర్ 123. రోహిత్ శర్మ 46 మ్యాచ్‌లు ఆడిన 57.30 సగటుతో 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 209.

నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్, కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటనతో మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో గత రికార్డుల నేపథ్యంలో ఆసీస్ పర్యటనలో రోహిత్-కోహ్లీలకు తిరుగులేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ మరో శతకం సాధిస్తే.. ఆసీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత బ్యాటర్‌గా నిలుస్తారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ సిరీస్ కోసం భారత జట్టు గురువారం ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో వన్డే సిరీస్ ఆడనుంది. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ.. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోకోకు ఈ సిరీస్ కీలకంగా మారింది.
వారి భవిష్యత్తును ఈ సిరీస్ దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం కోహ్లీ, రోహిత్ ముమ్మరంగా సాధన చేశారు. రోహిత్ శర్మ అయితే 20 కేజీల బరువు తగ్గి ఫిట్‌గా మారాడు. మరోవైపు కోహ్లీ లండన్ స్పెషల్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాడు. కోహ్లీ, రోహిత్ గతంలోలా దుమ్మురేపుతారో లేక విఫలమై ఆట నుంచి తప్పుకుంటారో చూడాలి.