భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 42 రోజుల పాటు భారత మ్యాచ్‌లు లేవని, రోహిత్ శర్మ, కోహ్లీ ఆటను మిస్సవుతున్నామని బాధపడేవారందిరిని సంతోష పరిచే విషయం ఏంటంటే.. మరో 20 రోజుల్లోనే టీమిండియా స్టార్స్ అంతా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులిప్ ట్రోఫీలో భారత స్టార్ ఆటగాళ్లంతా బరిలోకి దిగనున్నారు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ ఆటగాళ్లందరికి మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 6 జోన్ల నుంచి 6 జట్లు పాల్గొంటాయి. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ ఆడుతాయి.

భారత ఆటగాళ్లంతా తమ దేశవాళీ టీమ్స్ ప్రకారం ఆయా జోన్లలో బరిలోకి దిగుతారు. సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ చెన్నై వేదికగా 19వ తేదీన ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముందు వరకు భారత స్టార్ ఆటగాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడనున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐతో పాటు సెలెక్షన్ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంది.
మరోవైపు నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం.. సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచిస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు దులిప్ ట్రోఫీ ఆడనున్నట్లు తెలుస్తోంది.
అయితే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లంతా దులిప్ ట్రోఫీలో తొలి రౌండ్‌కు మాత్రమే పరిమితం కానున్నారు. సీనియర్ టెస్ట్ స్పెషలిస్ట్‌లు పుజారా, రహానేలు మాత్రం దులీప్ ట్రోఫీకి దూరంగా ఉండనున్నారు. భారత పేసర్లకుక సైతం దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు కూడా జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు.