T20 World Cup 2022: ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన రోహిత్, కోహ్లీ! (వీడియో)

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌తో బుధవారం ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మరోసారి టైటిల్ గెలిచే సువర్ణవకాశం చేజారింది. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.
షమీ బౌలింగ్‌లో బట్లర్ సిక్సర్‌తో ఇంగ్లండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసిన వెంటనే టీవీ కెమెరాలు విరాట్ కోహ్లీ వైపు తిప్పగా.. అతను తన క్యాప్‌లో ముఖాన్ని దాచుకొని కన్నీరు కార్చాడు. ఇక రోహిత్ శర్మ సరాసరి డగౌట్ చేరి నెత్తికి చేతులు పెట్టుకొని బాధపడ్డాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసినా.. అతను మాములు మనిషి కాలేకపోయాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడే సమయంలోనూ రోహిత్ కళ్లలో కన్నీళ్లు తిరగాయి.
ఒకటా రెండా.. నాలుగు ఐసీసీ టోర్నీల్లో రోహిత్, కోహ్లీ చాంఫియన్లుగా నిలవలేకపోయారు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడగా.. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నారు. సొంతగడ్డపై 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడి సెమీఫైనల్లోనే వెనుదిరిగాడు.
ఇక 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు. తాజా టోర్నీలో అద్భుత ప్రదర్శనతో సెమీస్ చేరి చెత్త ఆటతో ఇంటిదారి పట్టారు. తమ హయాంలో ఒక్క ఐసీసీ టైటిల్ అయినా అందించాలనే వారి కల నెరవేరకుండానే పోతుంది. భారత్ వేదికగా జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్ ఈ ఇద్దరికి చివరి అవకాశం. ఈ టోర్నీలోనైనా ఆ కల నెరవేర్చుకుంటారో.. ఇప్పటిలానే కన్నీటి పర్యంతమవుతారో చూడాలి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63), విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 నాటౌట్), అలెక్స్ హేల్స్(47 బంతుల్లో4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86 నాటౌట్) హాఫ్ సెంచరీలతో 170 పరుగుల అజేయ భాగస్వామ్యంతో చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్లలో భువీ రెండు ఓవర్లలో 25 పరుగులివ్వగా.. అర్ష్‌దీప్ 2 ఓవర్లలో 15, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30, మహమ్మద్ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications