
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సన్నదమవుతోంది. విజయమే లక్ష్యంగా నెట్స్‌లో చమటోడుస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించేందుకు సిద్దమవుతోంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన ఫన్నీ గేమ్‌తో నవ్వులు పూయించాడు. ఈ సరదా గేమ్‌లో సపోర్ట్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. దాంతో ప్రాక్టీస్‌లో ఆటగాళ్లంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. జాలీగా సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్, ఫన్నీ గేమ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
అసలు గేమ్ ఏంటంటే.. ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా రోహిత్ ఈ వినూత్న కాన్సెప్ట్‌ను ఆటగాళ్లకు పరిచయం చేసాడు. ఈ గేమ్ కోసం ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయారు. ఒక టీమ్‌కు రోహిత్ సారథి కాగా..మరో టీమ్‌కు కోహ్లీ నేతృత్వం వహించాడు. రోహిత్ టీమ్‌లోని వికెట్ కీపర్ రిషభ్ పంత్ హెల్మెట్ పెట్టుకొని మధ్యలో నిలబడగా.. ఫీల్డింగ్ కోచ్ టెన్నిస్ రాకెట్‌తో బంతిని గాల్లోకి కొడతాడు. ఆ బంతిని రిషభ్ పంత్ తన హెల్మెట్‌పై తాకించుకుంటాడు.
అయితే అప్పటికే పంత్ చుట్టూ ఉన్న ఇతర ఆటగాళ్లు ఆ బంతిని అందుకోవాలి. అలా బంతిని అందుకుంటే ఆ టీమ్ ఖాతాలో ఓ పాయింట్ వచ్చినట్లు. ఇలా పలు మార్లు ఆడిన ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో ఫన్ రావడంతో పగలబడి నవ్వారు.
కోహ్లీ టీమ్‌లో అతనే హెల్మెట్ పెట్టుకొగా.. ఇతర ఆటగాళ్లు క్యాచ్‌లు అందుకున్నారు. హెల్మెట్‌తో బంతిని తాకించుకునే క్రమంలో మజా వస్తుంటంతో మిగతా ఆటగాళ్లు సైతం హెల్మెట్ ధరించి బంతిని తాకించుకున్నారు. చివరకు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఈ గేమ్ ఆడాల్సిందేనని ఆటగాళ్లు పట్టుబట్టారు. దాంతో వారు కూడా చేసేదేమి లేక ఈ సరదా గేమ్‌లో పాల్గొన్నారు. దాంతో మైదానమంతా నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇక ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్ హోమ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌లో జరిగే ఫస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.