
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. విజ్డన్ టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్స్ నుంచి విజ్డన్ దినపత్రిక టాప్ 5 అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు లీడింగ్ క్రికెటర్‌ను సెలెక్ట్ చేసింది. ఈ వివరాలను విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ వెల్లడించారు.
ఇంగ్లండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ జోరూట్.. విజ్టన్ లీడింగ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2021లో టీమ్ విఫలమైనా.. అతను 6 సెంచరీలతో సత్తా చాటాడు. ఇక విజ్డన్ టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు డేవాన్ కాన్వే, ఓలీ రాబిన్సన్, డాన్ వాన్ కికెర్క్ ఎంపికయ్యారు.
ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో బుమ్రా, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారని విజ్డన్ ఎడిటర్ పేర్కొన్నాడు. 'గతేడాది సమ్మర్‌లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ రెండు టెస్ట్‌లు గెలవడంలో బుమ్రా, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారు. లార్డ్స్ టెస్ట్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. ఓవల్ టెస్ట్‌లో ఓలిపోప్, జానీ బెయిర్ స్టోను వరు ఓవర్లలో ఔట్ చేసి విజయాన్నందించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో వర్షం అంతరాయం కలిగించకుంటే బుమ్రా 9 వికెట్లతో భారత్ సునాయసంగా గెలిచేది. నాలుగు టెస్ట్‌ల్లో బుమ్రా 18 వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్‌లనూ సత్తా చాటాడు. టెయిలండర్‌గా కీలక పరుగులు చేశాడు.
ఇక భారత్ సాధించిన ఈ రెండు విజయాలకు రోహిత్ శర్మ గుండెకాయ. లార్డ్స్‌లో బ్యాట్‌తో అతను దుమ్మురేపాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై 83 పరుగులతో సత్తా చాటాడు. ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతని 127 పరుగులు విజయాన్నందించాయి. ఈ సిరీస్‌లో మొత్తం 368 పరుగులు చేసిన రోహిత్.. వ్యక్తిగత హై స్కోర్ 52. 'అని విజ్డన్ ఎడిటర్ రాసుకొచ్చాడు.