ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు గల్లంతయ్యాయి. దాంతో రోహిత్, గంభీర్‌ల నుంచి బీసీసీఐ వివరణ కోరేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో క్లీన్ స్వీప్ అవ్వడం, తుది జట్టు ఎంపికపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రోహిత్, గంభీర్‌లను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఈ ఏడాదిని టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ పర్యటనలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో అతను 164 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు రోహిత్ గైర్హాజరీలో టీమిండియాను నడిపించిన బుమ్రా అసాధారణ విజయాన్నందించాడు. దాంతో బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

మరోవైపు హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ కోల్పోవడంతో పాటు ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. దాంతో గంభీర్ నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ అంశాలన్నింటిపైనా బీసీసీఐ గంభీర్, రోహిత్‌లను వివరణ కోరనుంది.