ICC టాప్-5 ప్రపంచకప్ ప్లేయర్లు.. భారత్ నుంచి ఒక్కడే.. రోహిత్, కోహ్లీకి ఘోర అవమానం!

దుబాయ్: టీ20 ప్రపంచకప్ ముంగిట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం జరిగిందని వారి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరం క్రికెటర్లలోనే అత్యుత్తమ ఆటగాళ్లు అయిన ఈ ఇద్దరిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఘోరంగా అవమానించిందని మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటే ఐదుగురి ఆటగాళ్ల పేర్లను ఐసీసీ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ ఐదుగురు ఆటగాళ్లు టోర్నీ ఆఫ్ ద పెర్ఫెమార్లుగా నిలుస్తున్నారని పేర్కొంది. ఈ జాబితాలో టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అవకాశం దక్కించుకున్నాడు.

డేవిడ్ వార్నర్‌తో డేంజర్..
సూర్యతో పాటు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, శ్రీలంక సెన్సేషన్ వానిందు హసరంగా, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, పాకిస్థాన్ నుంచి మహమ్మద్ రిజ్వాన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో చేసిన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఈ జాబితాను తయారు చేసింది. డేవిడ్ వార్నర్ గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో 150 స్ట్రైక్‌రేట్‌తో పాటు మూడు హాఫ్ సెంచరీలతో 289 పరుగులు చేశాడని, బాబర్ ఆజామ్ తర్వాత హయ్యెస్ట్ రన్స్ బ్యాటర్ లిస్ట్‌లో అతనే ఉన్నాడని ఐసీసీ గుర్తు చేసింది. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచకప్ జరుగుతుందని, అతను మరింత ప్రమాదకరంగా మారనున్నాడని ప్రత్యర్థి జట్లను హెచ్చరించింది.

హసరంగా, బట్లర్..
శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగాతో కూడా ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని, ఇటీవల ఆసియాకప్‌లో ఏకంగా 16 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేసింది. పెద్దగా ఉండే ఆస్ట్రేలియా మైదానాల్లో అతను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడని ఐసీసీ జోస్యం చెప్పింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో అదరగొడుతున్నాడని, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడని పేర్కొంది. శ్రీలంకతో అజేయ సెంచరీ చేశాడని, రాజస్థాన్ రాయల్స్ తరఫున 863 పరుగులు చేసిన బట్లర్.. ఆస్ట్రేలియాలోనూ అదే జోరు కొనసాగిస్తాడని తెలిపింది.

సూర్య సూపరో సూపర్..
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఫుల్ జోష్‌లో ఉన్నాడని, మైదానంలో నలువైపుల ఆడే సూర్య.. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడని పేర్కొంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా రాణించలేకపోయినా.. ఈసారి సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నాడని ఐసీసీ రాసుకొచ్చింది. నిలకడగా రాణిస్తూ వరల్డ్ నెంబర్ బ్యాటర్‌గా ఎదిగిన తీరే దీనికి నిదర్శనమని పేర్కొన్నాడు. మహమ్మద్ రిజ్వాన్ సైతం అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని, గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి అతను నిలకడగా రాణిస్తున్నాడని తమ కథనంలో పేర్కొంది.

కోహ్లీ, రోహిత్‌కు ఆ సీన్ లేదా?
వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు అయిన కోహ్లీ, రోహిత్‌కు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంపై వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్ అని కామెంట్ చేస్తున్నారు. మెగా టోర్నీ అనంతరం ఐసీసీనే తమ జోస్యం తప్పని చెప్పి చెంపలు వేసుకుంటుందని సెటైర్లు పేల్చుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి నిలకడగా రాణిస్తున్నాడని, ఈ విషయం ఐసీసీ ఎలా మరిచిపోయిందంటూ మండిపడుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ హయ్యెస్ట్ రన్నర్‌గా నిలుస్తాడని జోస్యం చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications