
దుబాయ్: వన్డే మ్యాచ్‌లను చూసేంత ఓపిక జనాలకు లేదని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. భవిష్యత్తు అంతా టీ20, టీ10 ఫార్మాట్లదేనని అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఐఎల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ (డీసీ) తరుపున ఆడుతున్న రాబిన్ ఊతప్ప.. క్రికెట్ భవిష్యత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు ఉన్న క్రేజ్ వన్డే మ్యాచ్‌లకు లేదని చెప్పాడు.
'మారుతున్న మనిషి అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా క్రికెట్ కూడా మారుతూ వచ్చింది. ఫుట్‌బాల్ మాదిరిగానే ఇప్పుడు క్రికెట్‌లో ఫ్రాంఛైజీ లీగ్‌లకు క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రతీ క్రికెటర్‌కు అవకాశం దక్కుతోంది. భవిష్యత్తులో వన్డే క్రికెట్‌కు కాలం చెల్లుతుంది. ఇకపై ఆ మ్యాచులు చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పటికే జనాల్లో వన్డేలంటే విసుగు వచ్చిందని స్పష్టంగా అర్థమవుతోంది.
టీ20, టెస్టులకు మాత్రం క్రేజ్ అలాగే ఉంటుంది. టీ10 క్రికెట్ కూడా భవిష్యత్తును శాసిస్తోంది. చిన్న దేశాలు, అసోసియేట్ దేశాలకు టీ10 ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుంది. క్రికెట్ కూడా సూపర్ ఫాస్ట్ డైరెక్షన్‌ను అలవర్చుకుంటోంది. జనాలు దేనికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారో క్రికెటర్లు అదే ఆడాలి. చూడని మ్యాచులకు వ్యూయర్‌షిప్ మాత్రమే కాదు, స్పాన్సర్లు కూడా ఉండరు. వన్డే మ్యాచ్‌ల కోసం 7 నుంచి 8 గంటలు కూర్చొనే ఓపిక జనాలకు లేదు.. అంతా టీ20, టీ10 వంటి సూపర్ ఫాస్ట్ ఫార్మాట్లకు అలవాటు పడ్డారు'అని చెప్పుకొచ్చాడు.
భారత్ తరుపున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప.. 2015 తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2022 సెప్టెంబర్ 14న 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప.. ప్రపంచవ్యాప్తంగా జరగనున్న ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ (ఐఎల్‌టీ 20)లో పాల్గొంటున్నాడు.