బుడ్డోడు బ్రాడ్‌మాన్‌లా ఆడుతున్నాడు: రాబిన్ ఊతప్ప
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసల జల్లు కురిపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటతీరు దిగ్గజ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ తరహాలో ఉందని కొనియాడాడు.
ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్.. సర్ బ్రాడ్‌మన్‌ను తలపిస్తుందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. బ్రాడ్‌మన్‌ను అడ్డుకునేందుకు బౌలర్లు తరుచూ బాడీ లైన్‌లో బౌలింగ్ చేసేవారని, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు కూడా బౌలర్లు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.
ఈ తరం బ్రాడ్‌మన్..?
ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడిన రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఈ తరం బ్రాడ్‌మన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎదుగుతాడా? అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు బౌలర్లు ఎలా స్పందిస్తారో ఇంకా పూర్తిగా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అందరూ అతని బ్యాటింగ్ శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మనం ఇంకొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
బ్రాడ్‌మన్ తరహాలోనే బాడీ లైన్ బౌలింగ్.
బ్రాడ్‌మన్ కాలంలో ప్రత్యర్థి బౌలర్లు అతన్ని నిలువరించేందుకు బాడీ లైన్‌లో బౌలింగ్ చేసేవారు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా బ్రాడ్‌మన్‌లానే ఉంది. ముఖ్యంగా వైభవ్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అవుతాడు. వైభవ్ తన స్ట్రైక్‌రేట్‌తో పాటు యావరేజ్‌ను 40కి పైగా కొనసాగించగలిగితే అతన్ని ఒక అసాధారణ ఆటగాడిగా పరిగణిస్తారు. అదే సమయంలో రెండో ప్రపంచయుద్దం జరగకపోయి ఉంటే.. బ్రాడ్‌మన్ మరో 30 టెస్ట్‌లు ఆడి ఉంటే.. అతని సగటు 99-100 కంటే ఎక్కువగా ఉండేదేమో.
గతంలో కంటే ఇప్పుడు అసాధారణ ప్రదర్శనలు ఆటగాళ్ల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఆటగాళ్లు ఒకప్పటిలా సాంప్రదాయ బ్యాటింగ్, బౌలింగ్ టెక్నిక్‌లపై ఆధారపడటం లేదు. ఎక్కువ మంది ఆటగాళ్లు నిర్దిష్ట శైలి కంటే తమ సహజసిద్దమైన ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ధోనీ కూడా..
మహేంద్ర సింగ్ ధోనీ కూడా తనదైన శైలిలో ఆడి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.వైభవ్ కూడా తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఆడే సాంప్రదాయ ఆటను కూడా జనాలు ఆస్వాదిస్తున్నారు.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


