IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87)అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. భారత కీలక ఆటగాళ్లంతా విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్‌తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.
కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపించాడని ట్వీట్ చేశాడు. 'రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో భారత జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.'అని రాబిన్ ఊతప్ప ట్వీట్ చేశాడు.

40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. చెత్త షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి మూల్యం చెల్లించుకున్నాడు.
సెంచరీ మిస్సైనందుకు రోహిత్ బాధపడి ఉంటాడని గౌతమ్ గంభీర్ తెలిపాడు. 'రోహిత్ శర్మ చెత్త షాట్‌తో ఔటయ్యాడు. కీలక సమయంలో అతను వెనుదిరిగాడు. వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో ఛాన్స్ తీసుకొని ధాటిగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. సెంచరీ కంటే జట్టుకు భారీ స్కోర్ అందించాలనే తపనతోనే రోహిత్ ఆడాడు. అయితే చెత్త షాట్‌తో వెనుదిరగడం బాలేదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్‌ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్‌తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్‌వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యమే అయినా.. డ్యూ రాకపోతే మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. తీవ్ర ఒత్తిడిలో ఉంది.