న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసల జల్లు కురిపించాడు. అప్‌కమింగ్ వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. అయితే విరాట్ కోహ్లీ రికార్డుల కోసం ఆడే వ్యక్తి కాదని, సెంచరీల కన్నా జట్టు విజయం కోసం ఆడేందుకు ఎక్కువ ప్రాధానత్య ఇస్తాడని తెలిపాడు.
తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ రికార్డుల కోసం ఆడే ఆటగాడు కాదు. అభిమానులు.. క్రికెట్ విశ్లేకులు మాత్రమే వాటి గురించి ఆలోచిస్తారు. కానీ కోహ్లీ మాత్రం జట్టు విజయం కోసమే ఆడుతాడు. సెంచరీల కన్నా జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చేయడంపైనే ఫోకస్ పెడుతాడు.

ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో కూడా రికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసం కృషి చేస్తాడు. రికార్డులను అతను అస్సలు లెక్క చేయడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ లేదా ఇతర మ్యాచ్‌ల్లో సచిన్ 100 రికార్డు సెంచరీల రికార్డులను కోహ్లీ అధిగమించినా.. ఆ ఘనతను గొప్పగా భావించడు. ఎందుకంటే అతని ఫోకస్ మొత్తం భారత్‌ను గెలిపించడంపై మాత్రమే ఉంది.
సెంచరీలను ఏమాత్రం లెక్క చేయడం లేదు.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ పర్యటనలో సత్తా చాటిన యువ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మపై రాబిన్ ఊతప్ప ప్రశంసల జల్లు కురిపించాడు. తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడని కొనియాడిన రాబిన్ ఊతప్ప.. అప్‌కమింగ్ వన్డే ప్రపంచకప్ కోసం అతనిపై సెలెక్టర్లు ఓ కన్నేసి ఉంచుతారని అభిప్రాయపడ్డాడు.
'సుదీర్ఘకాలం జట్టు కోసం ఆడించాలనే ఆలోచన సెలెక్టర్లకు ఉంటే యువ క్రికెటర్లపై ఫోకస్ పెట్టాలి. పరిస్థితులకు తగ్గట్లుగా జట్టు కోసం ఆడే యువ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోవాలి. అందులో తొలుత తిలక్ వర్మ గురించి తప్పకుండా చర్చిస్తారని భావిస్తున్నా. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు.
వెస్టిండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీశాడు. అంతేకాకుండా ఎడమచేతివాటం బ్యాటర్ కావడం కూడా కలిసొచ్చే అంశం.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.