టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవలే మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కెరీర్ త్వరగా ముగియడానికి విరాట్ కోహ్లీనే కారణమని రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడి కెరీర్ నాశనం కావడానికి కూడా విరాట్ కోహ్లీనే కారణమని వెల్లడించాడు. అంబటి రాయుడు అంటే కోహ్లీ నచ్చేది కాదని, దాంతోనే 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించాడని రాబిన్ ఉతప్ప తెలిపాడు.

త్రీడీ ప్లేయరంటూ..
2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు చివరి నిమిషంలో అంబటి రాయుడిని జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు అవకాశం కల్పించారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేయగల త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ అంటూ అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియా సమావేశంలో అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై రాయుడు ఘాటుగా స్పందించాడు. 3డీ కళ్లద్దాలను ఆర్డర్ చేశానని, అతని ఆటను ఆ అద్దాలతో చూస్తానని సెటైర్లు పేల్చాడు. ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే రాయుడికి అవకాశం దక్కలేదని అప్పట్లో అందరూ అనుకున్నారు. తెలుగోడికి మరో తెలుగోడే శత్రువని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
కోహ్లీ వల్లే రాయుడిపై వేటు..
తాజాగా ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. ప్రపంచకప్ జట్టు నుంచి రాయుడి తప్పించడంపై స్పందించాడు. కోహ్లీ కారణంగానే రాయుడికి చోటు దక్కలేదని తెలిపాడు. 'కోహ్లీకి ఎవరైనా నచ్చకపోతే అతన్ని పక్కన పెట్టేస్తాడు. తనకు సరిగ్గా అనిపించలేదంటే అవకాశాలు ఏ మాత్రం ఇవ్వడు. అందుకు అంబటి రాయుడే ఉదాహరణ.
ప్రతీ ఒక్కరికి ప్రాధామ్యాలు ఉంటాయి. వాటిని నేను కూడా అంగీకరిస్తా. కానీ, అవకాశాలే లేకుండా చేయడం సరికాదు. రాయుడికి ప్రపంచకప్ జెర్సీలతో పాటు కిట్ కూడా అందించారు. అంతా సిద్దమైపోయింది. అలాంటప్పుడు ఎవరైనా ప్రపంచకప్‌లో ఆడుతామనే అనుకుంటారు. కానీ రాయుడిని కోహ్లీ అడ్డుకున్నాడు. అది నాకు ఏ మాత్రం నచ్చలేదు.'అని రాబిన్ ఉతప్ప చెప్పుకొచ్చాడు.
ఎమ్మెస్కే సైతం..
సెలెక్షన్ కమిటీ కారణంగానే 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదని, ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగానే అన్యాయం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఎమ్మెస్కే ప్రసాద్ ఖండించాడు. రాయుడు తనని అపార్థం చేసుకున్నాడని తెలిపాడు. సెలెక్టర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.