
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అలనాటి ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సీజన్ అభిమానులను అలరించింది. కరోనా కారణంగా కాస్త బ్రేక్ వచ్చిన ఈ సిరీస్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది.
ఈ సిరీస్ రెండో సీజన్‌లో ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దిగ్గజ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ చేరడంతో మొత్తం జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్‌లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో సీజన్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్‌తో పాటు డెహ్రాడూన్ వేదికగా జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్‌కు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. రాయ్‌పూర్ వేదికగా సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు లెజెండ్స్ లీగ్ క్రికెట్ కూడా సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2లో పాల్గొనే భారత జట్టు ఇదే..
సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), రాజేశ్ పవార్, వినయ్ కుమార్, యూసఫ్ పఠాన్, నమన్ ఓజా, సుబ్రమణ్యం బద్రీనాథ్, నోయల్ డేవిడ్, మన్ప్రీత్ గోని, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్