
ముంబై: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ సెగ క్రికెట్‌కు కూడా తగిలింది. ఇప్పటికే కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
తాజాగా ఈ మహమ్మారి ప్రభావం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్-2020పై కూడా పడింది. ఇప్పటికే ఈ సిరీస్ ప్రారంభమై సూపర్ సక్సెస్ అయింది. అలానాటి ఆటగాళ్ల ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు మైదానాలకు పోటెత్తారు. ముంబై వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌లకు ఊహించని రెస్పాన్స్ లభించింది.
ఇక మాజీ ఆటగాళ్లు.. లేటు వయసులో కూడా బౌండరీల మోత మోగించడం.. కళ్లు చెదిరే బంతులతో వికెట్లు పడగొట్టడం.. సూపర్ మ్యాన్ విన్యాసాలతో ఫీల్డింగ్ చేయడం.. అభిమానులకు కావాల్సిన మాజానిచ్చింది. అయితే ఇంత సక్సెస్ అయిన ఈ టోర్నీ ఇప్పుడు ప్రేక్షకుల్లేకుండానే చప్పగా సాగనుంది.
మహారాష్ట్రలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే అధికారికంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్-2020ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని సూచించింది. దీంతో 14 నుంచి 20 మధ్య నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లను ప్రేక్షకుల్లేకుండా జరగనున్నాయి. అలాగే ఇతర వేదికల్లో జరిగే మ్యాచ్‌లు కూడా అవే తేదీల్లో ఈ తరహాలోనే జరగనున్నాయి.