ప్చ్.. ఇర్ఫాన్ పఠాన్ చెలరేగినా ఇండియా లెజెండ్స్‌కు తప్పని పరాజయం!

రాయ్‌పూర్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఇండియా లెజెండ్స్‌కు ఓటమి తప్పలేదు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ లెజెండ్స్‌తో రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత దిగ్గజాల జట్టు 6 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. చివరి ఓవర్‌లో ఇండియా లెజెండ్స్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. పఠాన్ 2, 2, 6తో ఆశలు రేకెత్తించాడు. కానీ ఇంగ్లండ్ లెజెండ్స్ బౌలర్ చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో తర్వాతి 3 బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. దాంతో ఇండియా లెజెండ్స్‌కు ఓటమి తప్పలేదు

కెవిన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్.. కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (37 బంతుల్లో6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) వేగవంతమైన హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. కెవిన్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేయడం గమనార్హం. తద్వారా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో అత్యంత వేగవంతంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా కెవిన్ పీటర్సన్ నిలిచాడు. అతనికి తోడుగా డారెన్ మ్యాడీ(29) రాణించాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్(2/28), మునాఫ్ పటేల్(2/30) రెండేసి వికెట్లు తీయగా.. యూసఫ్ పఠాన్ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు.

పఠాన్ పోరాడినా..
అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత దిగ్గజాలు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులకే పరిమితమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో చెలరేగిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(6), కెప్టెన్ సచిన్ టెండూల్కర్(9) తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ కైఫ్(1), యువరాజ్ సింగ్(22), బద్రీనాథ్(8), యూసఫ్ పఠాన్(17), నమాన్ ఓజా(12) విఫలమవ్వగా.. మన్‌ప్రీత్ గోనీ( 16 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 35 నాటౌట్) సాయంతో పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కానీ ఇంగ్లండ్ బౌలర్లు మాంటీ పనేసర్(3/15), మాథ్యూ హోగ్గార్డ్ (1/18), జేమ్స్ ట్రేడ్‌వెల్(2/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పఠాన్ విజయాన్నందించలేకపోయాడు. ఇంగ్లండ్ లెజెండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది.

తొలి ఓటమి..
ఈ సిరీస్‌లో భారత్‌కు ఇది తొలి ఓటమి కాగా.. ఇంగ్లండ్‌కు రెండో విజయం. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇండియా లెజెండ్స్ 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఇంగ్లండ్ లెజెండ్స్ నాలుగింటిలో రెండు గెలిచి మరో రెండు ఓడి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. శ్రీలంక లెజెండ్స్ మూడు విజయాలతో రెండో స్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం.. అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ గతేడాదే ప్రారంభమైంది. కానీ కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులోకి రావడంతో గతేడాది వాయిదా పడిన దగ్గరినుంచే రీస్టార్ట్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications