Road safety world series చాంపియన్స్.. ఇండియా లెజెండ్స్!

రాయ్‌పూర్: క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా.. తమలో ఇంకా సత్తా తగ్గలేదని భారత దిగ్గజ క్రికెటర్లు నిరూపించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రిటైర్డ్ క్రికెటర్లతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఇండియా లెజెండ్స్ 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ జట్టును ఓడించింది.

చెలరేగిన యువీ, యూసఫ్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్(41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60), యూసఫ్ పఠాన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా... కెప్టెన్ సచిన్ టెండూల్కర్(23 బంతుల్లో 5 ఫోర్లతో 30)మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. లీగ్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(10) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

ఆదుకున్న సచిన్-యువీ..
35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇండియా లెజెండ్స్‌ను సచిన్-యువీ ఆదుకున్నాడు. ముఖ్యంగా యువరాజ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. పేసర్, స్పిన్నర్ అనే తేడా లేకుండా నాలుగు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 43 రన్స్ సమకూరడంతో ఇన్నింగ్స్ నిలబడింది. అయితే సచిన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లాంగాఫ్, లాంగాన్, మిడ్ వికెట్ రీజన్‌లో ఐదు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 85 రన్స్ జోడించడంతో భారీ స్కోర్ సాధ్యమైంది. చివర్లో ఇర్ఫాన్(8 నాటౌట్) కూడా ఓ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో మహరూఫ్, సనత్ జయసూర్య, వీరరత్నె తలా ఓ వికెట్ తీశారు.

చివర్లో తడబడిన లంక..
అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. దిల్షాన్ (18 బంతుల్లో 21), జయసూర్య (43), తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఇండియా బౌలర్లలో యూసఫ్ పఠాన్(2/26), ఇర్ఫాన్ పఠాన్(2/26) తలా రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ చేతుల మీదుగా సచిన్ లెజెండ్స్ కప్‌ను అందుకున్నాడు.

ఏడాది పాటు సాగిన టోర్నీ..
రోడ్డు భద్రతపై అవగాహన కలిగించడానికి మహారాష్ట్రకు చెందిన రోడ్ సేఫ్టీ సెల్, అన్ అకాడమీ సంస్థ సంయుక్తంగా ఈ సిరీస్ నిర్వహించారు. ఏడు దేశాలకు చెందిన రిటైర్డ్ ఆటగాళ్లతో ఈ టోర్నీ ఏర్పాటు చేశారు. గత ఏడాది మార్చి 7న ముంబై, పు ణే వేదికలుగా టోర్నీ ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత టోర్నీ వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాది మార్చి 5 నుంచి టోర్నీ కొనసాగించారు. కరోనా కారణంగా ఆస్ట్రేలియా ఈ ఏడాది సిరీస్ ఆడలేదు. అన్ని మ్యాచ్‌లు చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications